దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ ఒక కీలక ముందడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడిని కేటాయించింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ కొత్త ప్రాజెక్టులు భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా డిజిటల్ ఇండియా లక్ష్యాలను బలోపేతం చేస్తాయని తెలిపారు. ఆధునిక ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుతో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రక్షణ రంగాల్లో విదేశీ ఆధారాన్ని తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
కేబినెట్ సమావేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులపాటు మరికొన్ని ప్రధాన మౌలిక సదుపాయాల నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా… ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మెట్రో ఫేజ్-1బికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.5,801 కోట్ల వ్యయంతో 11.65 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణం చేపట్టనున్నారు. ఇది నగర ట్రాఫిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.
అదే విధంగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో 700 మెగావాట్ల టాటో-II హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. రూ.8,146 కోట్ల వ్యయంతో నిర్మించబడే ఈ ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.