ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బిహార్​లో చేపట్టిన (ఎస్​ఐఆర్​)ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. 2024 లోక్​ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, ఇకనైనా ఓట్ల చోరీ జరగకుండా చూడాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బిహార్​లో చేసిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్​ఐఆర్​)ను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్​ పవార్​ సహా ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద నిరసన ప్రారంభించే ముందు, వారంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే ర్యాలీగా వెళ్తున్న వీళ్లను ట్రాన్స్​పోర్ట్ భవన్​ వద్ద పోలీసులు అడ్డగించారు. విపక్ష నేతల ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని దిల్లీ పోలీసులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘ఎస్​ఐఆర్’​, ‘ఓట్​ చోరీ’ ప్లకార్డ్​లు, బ్యానర్లు పట్టుకొని విపక్ష నేతలు నినాదాలు చేశారు.

పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక గాంధీ
నిరసన ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సంజయ్​ రౌత్​, సాగరికా ఘోస్​ సహా పలువురు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బారికేడ్లు ఎక్కి నిరసన
ఈ ర్యాలీలో పాల్గొన్నవారిలో టీఆర్ బాలు(డీఎంకే), సంజయ్​ రౌత్​ (శివసేన-యూబీటీ), డెరెక్ ఓబ్రియాన్​ (టీఎంసీ), కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అఖిలేశ్​ యాదవ్​ (సమాజ్​వాదీ) (Akhilesh Yadav (Samajwadi) సహా ఆర్జేడీ, వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సుష్మితా సేన్ (Sushmita Sen)​, అఖిలేశ్ యాదవ్​ బారికేడ్లను ఎక్కి ఎస్​ఐఆర్​ను వెనక్కు తీసుకోవాలని, ఓట్ల చోరీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ, పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు “ఎస్​ఐఆర్ + ఓట్ల చోరీ = ప్రజాస్వామ్యం కూనీ” అనే బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు. ఈసీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వంతో కలిసి ఓట్ల చోరీకి పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) గతంలో ఇలాంటి ఆరోపణలు చేయగా, వాటిని ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Sessions of Parliament) ప్రారంభమైనప్పటి నుంచి బిహార్ ఎస్​ఐఆర్​పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. దీనితో రెండు సభలు తరచూ వాయిదా పడుతూనే వస్తున్నాయి. కేవలం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ​పై కొంత మేర మాత్రమే చర్చ జరిగింది. మిగతా పార్లమెంట్ కార్యకలాపాలు అన్నీ స్తంభించి పోయాయి.

రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పోరాటం
“వాస్తవం ఏమిటంటే వారు మాట్లాడరు. కానీ నిజం దేశం ముందు ఉంది. ఇది రాజకీయ పోరాటం కాదు. ఇది రాజ్యాంగాన్ని కాపాడడం కోసం చేస్తున్న పోరాటం. ఒక మనిషికి ఒక ఓటు కోసం చేస్తున్న పోరాటం. మాకు శుభ్రమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి.”

  • రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభ ఎంపీ

Leave a Reply