దేశ రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, చురుకుదనం పెంచే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆరు సంవత్సరాల్లో కనీసం ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనకుండా ఉన్న 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. కేవలం పేరుకే ఉన్న ఈ పార్టీలను జాబితా నుంచి తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను శుభ్రపరిచే ప్రయత్నం చేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, రిజిస్టర్ అయిన ప్రతి పార్టీ క్రమం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. కానీ 2019 నుంచి ఇప్పటివరకు ఈ 334 పార్టీలు ఒక్క అభ్యర్థినీ రంగంలోకి దింపలేదు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన చిరునామాలలో వీటి కార్యాలయాలు లేవని క్షేత్రస్థాయి తనిఖీల్లో తేలింది. ఈ రెండు నిబంధనలను పాటించకపోవడంతోనే వీటి గుర్తింపును రద్దు చేసినట్లు ఈసీ తెలిపింది.
ఈ నిర్ణయానికి ముందు దేశంలో 2,854 రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలు ఉండగా, ఇప్పుడు 334 పార్టీలు తొలగించడంతో సంఖ్య 2,520కి తగ్గింది. ఈ చర్య దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది.
అయితే, ఈ చర్య కేవలం గుర్తింపు లేని పార్టీలకే పరిమితమని, ప్రస్తుతం చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు ప్రభావితం కావని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం, నమ్మకాన్ని పెంపొందించేందుకు ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.