అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌లో విజయం సాధించిన ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిపై టై-బ్రేకర్‌లో గెలిచి టైటిల్‌ను దివ్య కైవసం చేసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

ఫైనల్‌లో తలపడిన ఇద్దరు క్రీడాకారిణులు భారతదేశానికే చెందినవారుగా ఉండటం దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతంగా నిలబెట్టిందని సీఎం తెలిపారు. “అవకాశాలు లభిస్తే మహిళలు ఏదైనా సాధించగలరని దివ్య, హంపి ఇద్దరూ నిరూపించారు,” అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రపంచ స్థాయిలో ఇటువంటి విజయాలు మహిళలకు మార్గదర్శిగా నిలుస్తాయని తెలిపారు.

ఇప్పటివరకు ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్‌లో భారత్ కు చెందిన మహిళా క్రీడాకారిణులు ఎవరూ సెమీఫైనల్స్‌కు కూడా చేరుకోలేదు. అయితే, ఈసారి ఏకంగా ఇద్ద‌రు భార‌త మ‌హిళ ప్లేయ‌ర్లు ఫైనల్‌కు చేరుకోవడం గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో వారిద్దరూ మెరుగైన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply