వెంటాడే కర్మఫలం
” నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి / అవశ్యమనుభోక్తవ్యం, కృతమ్ కర్మ శుభాశుభమ్”
మనం చేసిన పాప కర్మల, పుణ్య కర్మల ఫలితాలను మనం తప్పక అనుభవించాల్సిందే. అనుభవించకుండా కోట్లకొద్దీ బ్రహ్మకల్పములు గడిచినా చేసిన కర్మ నశించదు అని శాస్త్రవచనము. ఆ కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందంటే -”యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరమ్ / తథా పూర్వకృతం కర్మ కర్తారమను గచ్ఛతి”. వేలాది గోవులున్న ఆలమందలో లేగ దూడ తన తల్లిని గుర్తించి ఎలా తనవద్దకు చేరుతుందో, ఆ విధంగా గతంలో మనం చేసుకొన్న కర్మ ఫలం మనలను చేరుతుంది అని పైపంచతంత్ర శ్లోక భావం.
”తత్రాస్య స్వకృతం కర్మ ఛాయేవా నుగతం సదా”. స్వయం కృతమైన కర్మఫలాలు మనలను జన్మ జన్మలకు నీడలా అనుసరిస్తాయి. కర్మల ననుసరించే సకల ప్రాణులయొక్క జనన మరణాలు సంభవిస్తుంటాయి. ”స్వకర్మవశత: సర్వ జంతూనాం ప్రాభవాప్య¸°:” అని శాస్త్ర వచనం. దీనికి ఎంతటి వారైనా మినహాయింపు కాదు. ఈ అంశాన్ని వివరించే మహా భారత గాథ ఒకటుంది
మాండవ్యుడనే మహర్షి మహా తపశ్శాలి. మౌన దీక్షతో, బాహ్య స్మృతిలే కుండా, నిరంతరం తపస్సులో గడిపే వారాయన. రాజధాని పొలిమేరలలో ఉన్న ఆయన ఆశ్రమాన్ని కొందరు దొంగలు తాము దోచుకొచ్చిన ధనాన్ని దాచు కొనేందుకు మంచి ప్రదేశంగా ఎన్నుకొ న్నారు. ఎందుకంటే మాండవ్య మహర్షి కళ్ళు తెరవకుండా సదా తపస్సులోనే ఉంటాడు. కనుక తమను, తాము దా చిన సంపదను ఆయన చూడలేడు. ముని ఆశ్రమం కనుక రాజ భటులకు ధనము అక్కడ ఉంటుందనే అనుమా నం రాదు. ఇలా కొంత కాలం సాగింది. ఒకనాడు ఆ దొంగలు రాజుగారి కోశా గారాన్ని కొల్లగొట్టి, యథాప్రకారం మాం డవ్యుని ఆశ్రమం చేరుకొన్నారు. రాజ భటులు దొంగలను వెంటాడుతూ ఆశ్ర మంలో ప్రవేశించారు. దొంగలు ధనం అక్కడ వదిలి పారిపోయారు. ఆశ్రమ ఆవరణలో తపోదీక్షలో ఉన్న మాండవ్యుని ఎదుట నిలిచి భటులు ఆ దొంగల గురించి ప్రశ్నించారు. బా#హ్య ప్రపంచం పై ధ్యాసే లేని ఋషి వారికి ప్రత్యుత్తర మివ్వలేదు. ఆశ్రమంలో దోపిడీ సొమ్ము దొరకడంతో ముని వేషంలో ఉన్న దొంగగా మాండవ్యుడిని భావించి, ఆయన పెడ రెక్కలు విరిచి బంధించి రాజసభలో ప్రవేశ పెట్టారు భటులు. స్వయంగా మహారాజు ప్రశ్నించినా సమాధానమీ యకుండా, కళ్ళు తెరవక, తపస్సమాధిలో ఉన్న మాండవ్యునిపై రాజు గారికి కూడా అనుమానం కల్గి, అతనికి కొరత వేయించాడు. కొరత వేయడమంటే ఒక శూలాన్ని నిలువుగా నేలలో పాతి, దాని కొనను దోషి క్రింది భాగంలో గుచ్చుకొనేటట్లుగా ఆ శూలంపై కూర్చో బెడతారు. శూలం నెమ్మది నెమ్మదిగా దోషి దేహాన్ని చీల్చుకొంటూ, చిత్రవధకు గురిచేస్తూ, కంఠం వరకూ వచ్చి అతని ప్రాణం తీస్తుంది. ఆ బాధను భరించలే క చాలా మంది తమ అపరాధాన్ని అంగీకరించి క్షమాభిక్షను వేడుకొంటారు. కానీ మాండవ్యుడు తన తపోదీక్షను కొనసాగిస్తూనే ఉన్నాడు తప్ప కళ్ళు తెరవలేదు, నోరు విప్పలేదు. ఆ రాత్రి కొందరు దేవర్షులు పక్షులవలె వచ్చి మాండవ్యుని పరామర్శించటం చూచి రాజ భటులు ఆ విషయం రాజుగారికి చెప్పగా, ఆయన పరుగు పరుగున మాండవ్యుని
వద్దకు వచ్చి క్షమించమని వేడుకొన్నాడు. శూలంపైన నుండి ఆయనను దింపించి రాజు ఆ శూలాన్ని తీసివే సి, తగిన వైద్యం చేయమని రాజవైద్యులను పురమాయించాడు. కానీ, ఆ శూలం పూర్తిగా ఊడిరాక ఋషి దేహంలో కొంత భాగం మిగిలి మిగతా భాగం బయటకు తీసివేయబడింది. అప్పటి నుండి ఆయన ‘అణి మాండవ్యుడు’ అని పిలువబడ్డాడు. ‘అణి’ అంటే ఇనుప చీల/మేకు అని అర్థం.
తర్వాత కాలగతిలో మాండవ్యుడు యమపురికి వెళ్ళాడు. ”రాజుగారి చేత అంతటి క్రూరశిక్ష తనకు ఎందుకు విధించబడింది?” అని మాండవ్యుడు యముని ప్రశ్నించాడు. ”మహర్షీ ! నీ బాల్యంలో నీవు తూనీగలను పట్టుకొని వాటి దేహాలకు చిన్న చిన్న సూదులను గ్రుచ్చి ఆనందించేవాడివి. ఆ కర్మఫలం ఇప్పుడిలా అనుభవించావని” యముడు బదులిచ్చాడు. దానితో మాండ వ్యుడు మిక్కిలి కోపించి, తెలిసీ తెలి యని వయసులో చేసిన చిన్న తప్పుకు నాకు ఇంతటి క్రూరమైన శిక్షను విధించావు కనుక నీవు దాసీ పుత్రుడవై జన్మించమని యమునికి శాపమిచ్చాడు. ఆ శాప ఫలితంగా యముడు, వ్యాసుని వలన, దాసీగర్భము నుండి విదురునిగా జన్మించాడని మహాభారత గాథ చెబుతోంది. 14 సం వత్సరాల లోపు వయసున్న పిల్లలు ఏమి చేసినా అది తప్పుకాదనీ, ఆ వయసులో వారికి ఎవరు అపకారం తలపెట్టినా అది నేరమనీ మాండవ్యుడు ఒక న్యాయ సిద్ధాంతాన్ని కూడా రూపొందించాడు. అదే రూపాంతరం చెంది ఇప్పుడు జువెనైల్ ఆక్ట్‌గా ఉంది.
తెలిసి ముట్టుకొన్నా తెలియక ముట్టుకొన్నా నిప్పు ఎలా కాల్చి తీరుతుందో, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అలాగే మనలను వెంటాడుతుంది. దీనినే మనం ప్రారబ్ధం, విధిలీల, దైవలీల అని అనుకొంటూ ఉంటాము. ఇది మన సంస్కృతిలోనే కాక, పాశ్చాత్య సంస్కృతిలో కూడా ఉంది. పాశ్చాత్యులు దీనిని ఫేట్ అంటారు. కింగ్ లియర్ అనే ఆంగ్ల నాటకంలోని, తూనీగలు చిలిపి పిల్లల చేతులలో క్రీడా వస్తువులై రకరకాలుగా హింసకు గురైనట్లుగా దేవుళ్ళ చేతిలో మనమూ ఆటబొమ్మలమై శిక్షింపబడుతూ ఉంటాము అని అర్థం.
అయితే కర్మఫలాన్ని జ్ఞానమనే అగ్ని చేత నశింపచేయవచ్చునని భగవద్గీత నాలుగవ అధ్యాయంలో 19వ శ్లోకం సూచిస్తోంది. అయితే దానికి నిష్కామ కర్మాచరణాదుల ద్వారా జ్ఞానార్జన చేయడమొక్కటే మార్గం.
ఓం తత్సత్ !
- గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి