Top Story | రాముల‌మ్మ అల‌క‌! సైలెంట్ మోడ్‌లో విజ‌య‌శాంతి

మంత్రి ప‌ద‌వి రాలేద‌నే నిరుత్సాహ‌మా?
లీడ‌ర్ల‌కు, కేడ‌ర్‌కు దూరం దూరం
ఎమ్మెల్సీ ఇచ్చినా క‌నిపించ‌ని మార్పు
ఒక‌టి రెండు సార్లే మీడియా ముందుకు
స్థానిక ఎన్నిక‌ల కోసం మొద‌లైన క‌స‌ర‌త్తు
పార్టీ వాయిస్ వినిపిస్తార‌ని ఆశ‌ప‌డుతున్న కేడ‌ర్‌
కాంగ్రెస్ పాల‌న తీరుపై బీఆర్ఎస్‌, బీజేపీ విమ‌ర్శ‌లు
అవేమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న హ‌స్తం కీల‌క నేత‌
హైక‌మాండ్‌కు ఫిర్యాదు చేసే యోచ‌న‌లో లీడర్లు

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

తెలంగాణలో (Telangana ) రాజకీయాలన్నీ స్థానిక సంస్థ‌ల (local body ) ఎన్నికల (election ) చుట్టూ తిరుగుతున్నాయి. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ (congress ) రెడీ అవుతోంది. ఇందులో భాగంగా బీసీలకు (BC ) 42శాతం రిజర్వేషన్లు (reservation ) అమలు చేసేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఊరూరా తిరుగుతూ.. కేడర్‌ను యాక్టివ్ చేస్తున్నారు. కానీ, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayasanthi ) మాత్రం పార్టీ లీడర్లకు అందుబాటులో లేకుండా పోయారు. రాములమ్మ సినీ, పొలిటికల్ గ్లామర్ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తే.. ఆమె సైలెంట్ మోడ్‌లో ఉండటం హస్తం పార్టీ నేతలకు షాక్‌కు గురి చేస్తోంది. ఎందరో ఆశావహులు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి పిలిచి మరీ అవకాశమిస్తే ఎమ్మెల్సీ ప‌ద‌వి వచ్చాక విజ‌య‌శాంతి ఎక్కడా కనిపించడం లేదని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. కానీ, ఆమె మాత్రం ఎమ్మెల్సీ కంటే ఎక్కువగా మంత్రి పదవి కూడా ఆశించార‌ని, అది దక్కకపోవడంతో ఎమ్మెల్సీ పదవి వచ్చినా.. పార్టీపై గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఒక‌టి రెండుసార్లే మీడియా ముందుకు..

తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న విజయశాంతి.. గతంలో బీఆర్ఎస్, బీజేపీలో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు పార్టీ అప్ప‌గించింది. ఆ తర్వతా అధికారంలోకి వచ్చాక విజయశాంతి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో పదవి ఇస్తే పార్టీకి ఫైర్ బ్రాండ్‌గా మారుతారని లెక్కలు వేసుకుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇప్పుడేమో సైలెంట్ అయి పార్టీ లీడ‌ర్ల‌కు, కేడ‌ర్‌కు దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, గతాన్ని పక్కన పెడితే ఇక నుంచి విజయశాంతి యాక్టివ్‌గా ఉంటారని, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేస్తే తనదైన శైలిలో స్పందిస్తారని భావించారు. అయితే.. విజయశాంతిలో పార్టీ ఆశించిన మార్పు రాలేదనే చ‌ర్చ జ‌రుగుతోంది. తాను ఎమ్మెల్సీ అయిన రోజు ఫార్మాలిటీగా అందరితో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్న విజయశాంతి.. ఆ తర్వాత మీడియాకి దూరంగా ఉన్నారు. ఇటీవల శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో, హెచ్ఐసీసీలో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో మినహా ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలపై గానీ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గానీ విజయశాంతి స్పందించడం లేదు.

గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద మ‌హిళా లీడ‌ర్ల ఆందోళ‌న‌..

మరోవైపు పదేళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీపై పోరాటం చేసినా చాలా మంది లీడర్లకు పదవులు దక్కలేదు. దాంతో వారంతా పదవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్‌ సునీతా రావు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పడి ఏడాదిన్నర దాటినా పదవులు దక్కడం లేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం కొత్తగా వచ్చిన వలస నేతలు, పార్టీలో పనిచేయని లీడర్లకే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. అంతేకాదు ఎమ్మెల్సీగా విజయశాంతికి ఎందుకు అవకాశం ఇచ్చారో చెప్పాలని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌ను ప్రశ్నించారు. అయితే.. పార్టీ కోసం కష్టపడినా లీడర్లను వదిలేసి ఇన్‌ యాక్టివ్‌గా ఉన్న లీడర్లకు పదవులు కట్టబడితే ఇలాగే ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ప‌ద‌వికి న్యాయం చేయాలి..

మొత్తంమీద ఇటు ప్రభుత్వం, అటు పార్టీ కార్యక్రమాల్లో కానీ రాముల‌మ్మ‌ యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. అయితే.. ఎమ్మెల్సీ పదవి వచ్చాక అడపాదడపా మీడియా ముందుకు రావడం, గాంధీ భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారే తప్ప పెద్దగా కనిపించడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. అసలే సర్కార్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే.. ఎమ్మెల్సీగా ఉంటూ వాటిని ఖండించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కనీసం తీసుకున్న ఎమెల్సీ పదవికైనా న్యాయం చేయాలని విజయశాంతిని సొంత పార్టీ నేతలు కోరుతున్నారు.

Leave a Reply