- తెలంగాణకు న్యాయం చేస్తున్నది అతడే
- రేవంత్ ఎన్నుకోబడిన సిఎం
- ఎపి, తెలంగాణలో నీళ్ల రాజకీయం పెరిగింది
- పబ్బం గడుపుకునేందుకు నీటిని అడ్డుకుంటున్నారు
- జలవివాదంపై కేంద్రం కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నా
- ఢిల్లీ మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
న్యూ ఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నుకోబడిన నేత అని నామినేట్ చేయబడిన వ్యక్తి కాదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana). తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదని అంటూ పొట్టివాడు గట్టి వాడు అని ప్రశంసించారు.. ఢిల్లీ (Delhi) లో నేడు మీడియాతో మాట్లాడుతూ… రేవంత్‌ను విమర్శిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఏపీ, తెలంగాణ (AP, Telangana) రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీళ్లను అడ్డుకోవద్దన్నారు. రెండు రాష్ట్రాలు నీటి పంపిణీ ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. నీటి ప్రాజెక్టుల గురించి సీపీఐ ఎప్పుడూ సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తుందన్నారు. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలని సూచించారు. రాయలసీమకు నీళ్ళు అవసరం అని తెలిపారు. ఏపీ, తెలంగాణలో నీటి అంశాలను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నీళ్ళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ గా మారిన వెంటనే సెంటిమెంట్ గోవింద…
టీఆర్ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయిందని.. ఇప్పుడు సెంటిమెంట్లు లేవంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిమయం అయిందని ఆరోపించారు. బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారన్నారు నారాయణ. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్లను తెర మీదికి తెచ్చారన్నారు.
రేవంత్ చర్చించకపోవడం చంద్రబాబు తప్పే..
బనకచర్ల గురించి చంద్రబాబు మొదట మాట్లాడాల్సింది తెలంగాణ ముఖ్యమంత్రితో అని.. అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ సీఎం ఆ ప్రాజెక్టను వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు. బనకచర్ల ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదన్నారు. మొదట పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నారు. బనకచర్ల 80వేల కోట్ల ప్రాజెక్టు కాదని.. 2 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. ముందుగా ఇరు రాష్ట్రాలు వివాద రహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని నారాయణ సూచించారు.

