దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు (మంగళవారం) లాభాల్లో ముగిశాయి. గత నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అలాగే దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకోవడం పెట్టుబడిదారుల సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది.
అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి. ముఖ్యంగా ఆటో రంగ సూచీ 1.5% వరకు లాభపడగా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు సుమారు 1% పెరిగాయి.
సెన్సెక్స్ ఉదయం 82,233 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో మొదలైనప్పటికీ, వెంటనే లాభాల దిశగా తిరిగింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 82,743 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి, చివరికి 317 పాయింట్ల లాభంతో 82,570 పాయింట్ల వద్ద నిలిచింది.
నిఫ్టీ సూచీ 113 పాయింట్ల లాభంతో 25,195 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.82 వద్ద కొనసాగింది.
సెన్సెక్స్ 30 షేర్లలో సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు గణనీయమైన లాభాలు అందించాయి. అయితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
అంతర్జాతీయంగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 68.99 డాలర్లకు చేరగా, బంగారం ఔన్సు ధర 3,374 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మొత్తంగా, స్థిరమైన అంతర్జాతీయ సూచీలు, ద్రవ్యోల్బణంలో తగ్గుదల పెట్టుబడిదారులకు ఊరటనిచ్చి మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి.