- దేశ వ్యాప్తంగా రైల్వే కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు
దేశంలో రైలు ప్రయాణం మరింత సురక్షితంగా మారబోతోంది. ఇక నుంచి రైళ్లలోని సాధారణ ప్రాంతాలలో కఠినమైన నిఘా ఉండబోతోంది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు రైల్వే కోచ్‌లలో దాదాపు 74,000 కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే దుండగులు, చోరీ ముఠాలను కట్టడి చేయడానికి ఇది పెద్ద ఎత్తున తీసుకుంటున్న కీలక చర్యగా రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే నార్తర్న్ రైల్వేలో లోకో ఇంజిన్లు, కొన్ని కోచ్‌లలో సీసీటీవీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఆ ఫలితాల ఆధారంగా ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సమీక్ష సమావేశంలో రైల్వే మంత్రి వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ట్రయల్ ప్రాజెక్ట్ పురోగతిని పరిశీలించిన తర్వాత 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ వ్యవస్థ అమరికకు ఆమోదం తెలిపారు.
ప్రతి కోచ్‌లో 4 సీసీటీవీలు
ప్రతి కోచ్‌లో ప్రవేశ ద్వారాల వద్ద రెండు చొప్పున మొత్తం నాలుగు డోమ్ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. లోకోమోటివ్‌లకు ముందూ, వెనకా, ఇరువైపులా మొత్తం ఆరు సీసీటీవీ కెమెరాలు అమర్చనున్నారు. అలాగే ప్రతి లోకో క్యాబ్‌లో డోమ్ కెమెరాలు, డెస్క్-మౌంటెడ్ మైక్రోఫోన్లు ఉంటాయి.
ఎప్పుడు, ఎక్కడైనా క్లియర్ ఫుటేజ్
గంటకు 100 కి.మీ. పైగా వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, అలాగే తక్కువ వెలుతురు ఉన్నా కూడా స్పష్టమైన వీడియో రికార్డింగ్ వచ్చేలా అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఇండియా ఏఐ మిషన్ తో కలిసి సీసీటీవీ డేటాకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విశ్లేషణను వినియోగించే అవకాశాలను కూడా పరిశీలించాలని మంత్రి సూచించారు.
గోప్యతకు భంగం లేకుండా
ప్రయాణికుల గోప్యతకు భంగం కలిగించకుండా, ఈ కెమెరాలు కేవలం సాధారణ రాకపోకల ప్రాంతాలకే పరిమితం అవుతాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో రైళ్లను మరింత సురక్షితం, ఆధునికం, ప్రయాణికులకు అనువుగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఇది కీలక భాగమని రైల్వే శాఖ పేర్కొంది.
ఇకపై రైల్లో ప్రయాణం సురక్షితమని, బాధ్యతారాహిత్యంగా ఆచరణలు చేసేవారికి ఇక తప్పించుకునే మార్గం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.