వెలగపూడి – నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం దారుణమని, ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “మహిళలపై అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి” అని ఆయన పేర్కొన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు.
గతంలో శాసనసభలోనూ వైసీపీ నేతలు ఇలాగే ప్రవర్తించారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్పారని పవన్ గుర్తుచేశారు. మహిళలను కించపరిచే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాజకీయాలను రాష్ట్రంలోని మహిళా సమాజం మరోసారి తిప్పికొడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
దాడితో మాకేం సంబంధం .. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. దాడులు చేసే సంస్కృతి తమది కాదని, ప్రసన్నకుమార్ రెడ్డి వల్ల గతంలో ఎంతోమంది తీవ్రమైన బాధలు అనుభవించారని, వారిలో ఎవరో ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై తనపై వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.
వివరాల్లోకి వెళితే, సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటిలోని ఫర్నీచర్‌తో పాటు పలు కార్లు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందిస్తూ, తనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రసన్నకుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నేతలు తమ ఇంట్లోని మహిళలకు చూపించగలరా అని ఆమె ప్రశ్నించారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు.