హైదరాబాద్ – ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సిట్ అధికారులు కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందర్ రావు లను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం, ఏదైనా ఓ వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనంతరం ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాను ఆయన రివ్యూ కమిటీకి పంపుతారు. ఆ రివ్యూ కమిటీ కేంద్ర టెలికం శాఖ నుంచి అనుమతి తీసుకున్నాకే సదరు ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది.
అయితే, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని ఎస్‌ఐబీ బృందం ట్యాపింగ్ కోసం సుమారు 618 ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టగా.. నాటి సీఎస్ శాంతి కుమారి ఆ ఫోన్ నెంబర్ల లిస్ట్‌ను కేంద్ర టెలికం శాఖ కి పంపి అనుమతి తీసుకున్నట్లుగా సిట్ గుర్తించింది. ఇప్పటికే ఈ విషయంలో నాటి రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్‌కు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి సమాధానాలు రాబట్టారు. తాజాగా ఇవాళ మాజీ సీఎస్ శాంతి కుమారితో పాటు నాటి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందర్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు..