Exclusive | కౌన్ బనేగా ఢిల్లీ సుల్తాన్!
బీజేపీలో ఆశలు రేపిన ఎగ్జిట్ పోల్స్!
సామాన్యుల సానుభూతితో అరవిందోదయం?
సంక్షేమంపై కేజ్రీవాల్‌పై క్రేజీ అప్‌డేట్స్
మహిళలు, మతపరమైన సంస్థలకూ పథకాలు
అవినీతి ఆరోపణలే ప్రధాన అస్త్రంగా కాషాయదళం
20 ఏళ్లుగా తారుమారవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
ఎవరు గెలుస్తారు, ఏం చేస్తారనే చర్చోపచర్చలు
ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్‌పై దేశవ్యాప్తంగా ఎడతెగని ఆసక్తి
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 60.42 శాతం పోలింగ్ జరిగినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 62.82 శాతం పోలింగ్ జరిగింది. దీని ప్రకారం పరిశీలిస్తే ఈసారి 2.40 శాతం పోలింగ్ తగ్గింది. ఓట్లు వేసిన పౌరుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఎల్లుండి అంటే ఫిబ్రవరి 8వ తేదీన అధికారికంగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ , బీజేపీ, కాంగ్రెస్ తలపడ్డాయి. త్రిముఖ పోటీలో ఆప్, బీజేపీ మాత్రం నువ్వా నేనా అనే రీతిలో కదం తొక్కాయి. హ్యాట్రిక్ కోసం ఆప్.. 27 ఏళ్ల వనవాసం నుంచి అధికారంలోకి రావాలని కమలనాథులు ఆశపడుతున్నాయి. ఆప్ వరుసగా 2015, 2020లో అధికారాన్ని చేజిక్కించుకుంది. 2013లో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను నీరుగార్చిన ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో 67స్థానాలు గెలిచి.. జాతీయ పార్టీలను ఊడ్చివేసింది. 2020లో 62 సీట్లుతో మరోసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తుడిచి పెట్టింది.
బీజేపీ డబుల్ ఇంజిన్ పరివర్తన్ ఆశలు..
ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నించింది. గడిచిన ఆరు ఎన్నికల్లో అధికారాన్ని అందుకోలేకపోయింది. చివరిసారిగా బీజేపీ 1993లో గెలిచింది. 1993లో 49సీట్లతో భారీ విజయం సాధించినప్పటికీ, అయిదేళ్ల కాలంలో ఢిల్లీ సీఎంను మూడుసార్లు మార్చింది. బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానాను, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మను, చివరికి సుష్మా స్వరాజ్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేసింది. 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ తరువాత కాంగ్రెస్ ను మట్టికరింపించే బాధ్యత ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేపట్టటంతో.. బీజేపీకి ఆశలు గల్లంతు అయ్యాయి.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలయికతో…
2013 ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లను గెలుచుకుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలయికతో బీజేపీకి అధికారం దక్కలేదు. ఆ తర్వాత, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లను, 2020లో 8 సీట్లను మాత్రమే పొందింది. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణాస్త్రాలను సంధించింది. సీఎం కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో జైలుకు పంపించింది. ఆరు నెలలు కోర్టులు విచారణ జరపలేదు. బెయిల్ దక్కనీయలేదు. రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఈ ఎన్నికలపై ఈ ప్రభావం ఎంత వరకు పని చేస్తుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
జనం సానుభూతే కేజ్రీ ఆయుధం..
రెండు దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు కునుకు లేకుండా ఢిల్లీ పీఠంపై అధిష్టించిన ఆమ్ ఆద్మీపార్టీకి ఈ ఎన్నికల్లో ఆటుపోట్లు తప్పక పోవచ్చు. కానీ, జనం దూరం అయ్యారా? దగ్గరకు తీసుకున్నారా? ఆదే రాజకీయ విశ్లేషకులకు కూడా అందని అంచనాగా ఉండిపోయింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఢిల్లీ ప్రజలు ఇంకా పూర్తిగా నమ్మలేకపోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి కేంద్రం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూనే ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గవర్నర్‌తో తిప్పికొట్టటం సాధరణంగా మారింది.
బలం తగ్గినా, ఆమ్ ఆద్మీదే అధికారం..
ఇక అధికార పార్టీలో అంతర్గత విబేధాలు కొంత మేరకు నష్టం తీసుకువచ్చిన మాట వాస్తవం. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూనే.. ఇతర రాష్ట్టాల్లో అమలు జరుగుతున్న మహిళా సంక్షేమ పథకాలు, సర్వమత సామరస్యం పేరిట ఆలయాలు, మసీదులు, చర్చీల్లో దేవ సేవకలకూ సంక్షేమ పథకాలను అరవింద్ కేజ్రీవాల్ తెరమీదకు తీసుకు వచ్చారు. ఈ స్థితిలో అసెంబ్లీలో బలం తగ్గవచ్చు కానీ… మేజిక్ ఫిగర్‌తో మళ్లీ తాము అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఆశపడుతోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి అయితే అసలు ఆశలే లేవని చెప్పుకోవాలి. 2015 నుంచి 70 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కాగా.. ఈ సారి 3 సీట్లల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.