KNL | ద్విచక్ర వాహనాదారులు తప్పక హెల్మెట్‌ ధరించాలి…

కర్నూలు బ్యూరో : ద్విచక్ర వాహనాదారులు తప్పక హెల్మెట్‌ ధరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషా అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా గురువారం హెల్మెట్‌ ధరించడంపై జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ పై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్ ధరించి అవగాహన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్, కలెక్టరేట్ మీదుగా సి.క్యాంపు సెంటర్ వరకు కొనసాగింది.

ఈసంద‌ర్భంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషా మాట్లాడుతూ… జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పౌరుడు తన భద్రతకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. క్షేమంగా వెళుతున్నా అవతలి వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి బైక్ లు నడిపి ఇతరులను రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్నారన్నారు. ఈ ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల‌నే తలకు ఎక్కువగా గాయాలై రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారన్నారు. అందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ… జనవరి 16 నుండి ఫిబ్రవరి 15వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ బాధ్య‌త‌గా హెల్మెట్ ధరించాలన్నారు. తలకు హెల్మెట్ ధరించడం వలన 90శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు.

ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనల్ శాంతకుమారి, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఆర్డీఓ సందీప్ కుమార్, అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీలు, సిఐలు, ఆర్ ఐలు, ఆర్ టి ఓ అధికారులు ఎస్సైలు, ఆర్ ఎస్సై లు, ట్రాఫిక్ పోలీసులు, సివిల్ , ఎఆర్ , ఎపిఎస్పీ , ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, ఆయా షోరూం ల సిబ్బంది, డ్రైవింగ్ స్కూళ్ళ వారు సుమారు 700 మంది హెల్మెట్ ర్యాలీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *