TG | పంచాయితీల్లో పడకేసిన పాలన…మొద్దు నిద్రలో ప్రభుత్వం – కేటీఆర్
హైదరాబాద్ – ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీల్లో పాలన పడకేసిందని, అయినా ఇంకా మొద్దు నిద్రలోనే ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.. రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి.. గ్రామ సచివాలయాల్లో కూడా పాలన గాడితప్పిందన్నారు. ఈ మేరకు నేడు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,789 పంచాయతీలు ఉండగా.. దాదాపు 80శాతం సమస్యలతో సతమతమవుతున్నాయని వివరించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక.. పల్లెల్లో పాలన ఆగిపోయిందన్నారు. ప్రత్యేకాధికారులు పాలనలో చాలా పంచాయతీలు నిర్వహణ లేక పారిశుద్ధ్యం, వీధి దీపాల మరమ్మతులకూ నిధుల కటకట ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు.
గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..? సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేడెట్లా అని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని.. వీధి దీపాలు వెలగకపోవడంతో పల్లె సీమలను చిమ్మ చీకట్లు ఆవరించాయని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసల్లేవని.. పంచాయతీ ట్రాక్టరు డీజిల్ పోసే దిక్కులేదని కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేనా ప్రజాపాలనా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు. ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కళ్లుతెరవరా అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో రూపురేఖలు మారాయని.. నాడు పంచాయతీలకు కడుపునిండా నిధులు వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చిందని విమర్శించారు. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ లు అప్పులపాలయ్యారని.. నేడు జేబుల నుంచి ఖర్చుచేసిన కార్యదర్శులకు తిప్పలు తప్పడం లేదన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.