AP | ప్రయాణికులను దోపిడీ చేసే ముఠా అరెస్ట్ !
- పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు…
- 60 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం..
( విజయవాడ ఆంధ్రప్రభ ) : నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ప్రయాణికుల నుంచి విలువైన ఆభరణాలను తస్కరిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. గడచిన కొన్ని రోజులుగా బస్టాండ్ ఆవరణలో తిరుగుతూ పలువురు ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలకు వీరు పాల్పడుతున్నారు.
ముగ్గురు సభ్యులు ఉన్న ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 60 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఎస్ఐ ఏ సూర్యనారాయణ వివరాలను వెల్లడించారు.
హైదరాబాదుకు చెందిన కే సత్యనారాయణమ్మ బస్టాండ్ లో ఎదురుచూస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన మెడలో నుంచి గొలుసు లాక్కునిపోయారని జనవరి 29వ తేదీన కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అద్దంకి వెళ్లడానికి బస్టాండుకు వచ్చిన ధూళిపాళ్ల సంయుక్త అనే మహిళ వద్ద 16 గ్రాముల బంగారు గొలుసు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుపోయారని జనవరి 30వ తేదీన ఫిర్యాదు వచ్చింది.
వీటితోపాటు నగరంలోని మాచవరం ప్రాంతానికి చెందిన మానస గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడ బస్టాండ్ కి రాక బస్సులో తన వద్ద ఉండవలసిన బ్యాగును ఎవరో తెంచుకుపోయారంటూ ఫిర్యాదు చేశారు. వీటిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ క్రమంలో గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన ఏ శ్రీనివాసరావు, గన్నవరానికి చెందిన అబ్దుల్తో అరకేప్ తో పాటు గుంటూరు జిల్లాకు చెందిన కె సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి దొంగిలించిన ఆభరణాలతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.