- సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్…
- నాలుగు రోజులు పాటుగా నిర్వహణ..
- బీచ్ లో పలు క్రీడా పోటీలు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ మసులా బీచ్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బీచ్ ఫెస్టివల్ ను తిలకించేందుకు సుమారు 15లక్షల మంది పర్యాటకులు వస్తారన్న అంచనా నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బీచ్ ఫెస్టివల్ లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, పలువురు కళాకారులు హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా పలు క్రీడా పోటీలతో పాటు, వివిధ కళా రంగాలకు చెందిన ప్రముఖులు వారి ప్రదర్శనలను ఇవ్వనున్నారు. గురువారం సాయంత్రం 4గంటలకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమంతో ఈ ఫెస్టివల్ ఆరంభం కానుంది.
పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహించే ‘మసులా బీచ్ ఫెస్టివల్ – 2025 నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు.
గేట్ వే ఆఫ్ అమరావతి :
దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద ఈవెంట్‌గా మసులా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. ఎమ్యూజ్ మెంట్, ఎంటర్ టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు. ఇక నేటి ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో 60అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు:
ఇంక 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించనున్నారు. 6వ తేదీ సాయంత్రం నుంచి తెలుగు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు వారి రుచులు, ప్రత్యేకంగా బందరు రుచులు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు 100కి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
స్టాల్స్ ఏర్పాటు:
వివిధ ప్రాంతాల నుంచి ఈ పెస్టివల్‌లో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, అలాగే పెడన, మచిలీపట్నం కలంకారీ వస్త్రాల స్టాల్, చిలకలపూడి బంగారం రోల్డ్ నగలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా 80 అడుగుల అమరావతి ఐకానిక్ నిర్మాణం, అసెంబ్లీ టవర్లు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. 2018లో నిర్వహించిన బీచ్ ఉత్సవాలలో సుమారు 10 లక్షల మంది పాల్గొన్నారని, ఇప్పుడు 15 లక్షల వరకు పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వినోదాన్ని పంచెందుకు బుల్లితెర నటులు:
మంగినపూడి బీచ్ కళాఖండాలతో నిండిపోయింది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపలు, తిమింగలాలు, పీతలతో పాటు డాల్ఫిన్ ఆకృతులు ఏర్పాటు చేశారు. సందర్శకులు భారీగా రానున్న నేపథ్యంలో బీచ్‌లో అమరావతి గేట్‌వే ఆకృతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ బీచ్ ఫెస్టివల్లో పర్యాటకులు వినోదాన్నిఅందించేందుకు పలువురు బుల్లితెర నటులు, గాయకులు రానున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బీచ్ పెస్టివల్కు వచ్చే సందర్శకుల కోసం మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి ప్రభుత్వం ఉచితంగా బస్సులు నడుపుతోంది. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యాంత్రంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది.
కబడ్డీ ఛాంపియన్ షిప్:
బీచ్ ఫెస్టివల్లో భాంగా 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ జరుగనుంది. ఈ ఛాంపియన్ షిప్లో 24 రాష్ట్రాల నుంచి పురుషుల, 21 రాష్ట్రాల నుంచి మహిళలా జట్లు పాల్గొనున్నాయి. సుమారు 600 మంది క్రీడాకారులు, నిర్వహకులు ఈ టోర్నిలో ప్రాతినిధ్యం వహించనున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్ని జరుగనుంది. 3వ జాతీయస్థాయి కయాకింగ్ పోటీలను రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహించనున్నారు.
బీచ్ వాలీబాల్ పోటీలు:
మసులా బీచ్ ఫెస్ట్-2025లో భాగంగా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 8 పురుషల, 4 మహిళల జట్లు పాల్గొననున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్దతిలో పోటీలు జరుగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల నుంచి పురుషుల జట్లు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి మహిళల జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.