మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, బంగారు, ఆర్థిక, సామాజిక తెలంగాణ దిశగా సమన్వయంతో ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (ప్రజా వ్యవహారాలు ) కే.కేశవరావు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి సమీకృత కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించు కుంటున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.

ఈసందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో, అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని కోరుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్య పరచడంలో తమవంతు సహకారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య, వైద్యం తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుంది భూభారతి, రైతు రుణమాఫీ, ప్రజా ప్రభుత్వ ఆరు గ్యారెంటీ ల పథకాలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలవుతున్నాయన్నారు. ప్రజలు కోరుకునే సంక్షేమం ప్రజాపాలన ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్ జోజి, డీపీఓ యాదయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
