- ట్రంప్ 25 శాతం టారిఫ్ వార్నింగ్‌ను లైట్ తీసుకున్న ఆపిల్
ఇండియాతో పాటు ఏ దేశంలో తయారైన ఐఫోన్ల పై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక పెద్దగా ఫలించే అవకాశం లేదు. సుంకాలు విధించినా ఇండియాలో తయారు అయ్యే ఐఫోన్లు అమెరికాలో చౌకగానే లభిస్తాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) స్పష్టం చేసింది. యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌ను నేరుగా ట్రంప్ హెచ్చరించినా కంపెనీ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టెక్ నిపుణులు కూడా భావిస్తున్నారు.
చైనా వెలుప తయారీని పెంచాలన్న యాపిల్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియా తయారీ పెంచేందుకు యాపిల్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసిందని సంబంధిత వర్గాలు కూడా వెల్లడించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో యాపిల్ ప్రణాళికల అమలు విషయంలో ట్రంప్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు తయారీనే లేని అమెరికాలో ఐఫోన్ల ఉత్పత్తి చేపట్టడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారమని, ఇది ట్రంప్ చెప్పినంత తేలిక కాదని, ఆయనే తన సుంకాల విషయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంటుందని టెక్ రంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ఖరీదు…
జీటీఆర్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలో ఐఫోన్ల తయారీ చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. ఇండియాలో ఒక ఐఫోన్లును అసెంబుల్ చేసేందుకు 30 డాలర్ల వ్యయం అవుతుంది. ఇదే అమెరికాలో ఇది 390 డాలర్లు అవుతుంది. ప్రధానంగా కార్మికుల జీతభత్యాలే ఇందుకు కారణం. ఇండియాలో ఐఫోన్ల అసెంబ్లింగ్ చేసే కార్మికుడు సగటున నెలకు 230 డాలర్ల వేతనం పొందుతున్నాడు.
అదే అమెరికాలో ఒక వర్కర్ నెలకు సగటున 2,900 డాలర్ల వేతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇండియాతో పోల్చితే 13 రేట్లు అధికం. ట్రంప్ 25 శాతం సుంకం విధించినప్పటికీ ఇండియా తయారీ ఐఫోన్లే అమెరికాలో చౌకగా లభిస్తాయని జీటీఆర్‌ఐ స్పష్టం చేసింది.
ఇండియాలో ఐఫోన్ ఖరీదు 1000 డాలర్లు ఉంటే, దానికి ట్రంప్ సుంకాలు 25 శాతం అంటే 250 డాలర్లు కలుపుకోవాల్సి ఉంటుంది. ఫోన్ అసెంబ్లింగ్ వ్యయం 30 డాలర్లు కూడా కలిపితే మొత్తం సుంకాలతో కలిపి తయారీ వ్యయం 280 డాలర్లు అవుతుంది.
అనేక దేశాల భాగస్వామ్యం…
ఐఫోన్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కంపోనెంట్స్‌ను వినియోగిస్తున్నారు. అందువల్ల ఐఫోన్ వాల్యూ చైన్ ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయబడి ఉంది. యాపిల్ బ్రాండింగ్, డిజైన్, సాఫ్ట్‌వేర్ కోసం ఒక్కో ఐఫోన్‌కు 450 డాలర్లు కంపెనీ ఖర్చు చేస్తుంది. క్వాల్‌కామ్, బ్రాడ్ కామ్ వంటి అమెరికా చిప్ తయారీ కంపెనీలకు 80 డాలర్లు, తైవాన్ కంపెనీ 150 డాలర్ల విలువైన చిప్‌లను అందిస్తాయి. దక్షిణ కొరియా 90 డాలర్ల విలువైన ఓఎల్‌ఈడీ, మెమరీ కార్డును సరఫరా చేస్తోంది. జపాన్‌కు చెందిన కంపెనీ 85 డాలర్ల విలువైన కెమెరా మాడ్యూల్స్‌ను సరఫరా చేస్తోంది.
జర్మనీ, మియత్నాం, మలేషియా వంటి ఇతర దేశాలు 45 డాలర్ల విలువైన ఇతర కంపోనెంట్స్‌ను అందిస్తున్నాయి. ఇండియాలో, చైనాలో తుది అసెంబ్లీంగ్ మొత్తం విలువలో 3 శాతం కంటే తక్కువగా ఉంటుంది. భారత్‌లో ప్రభుత్వం నుంచి పీఎల్‌ఐ స్కీమ్ కింద మద్దతు లభిస్తుంది. లోకల్ తయారీ మూలంగా యాపిల్ పీఎల్‌ఐ స్కీమ్ కింద ఆర్ధిక సాయం పొందుతుంది. దీని వల్ల మొత్తం తయారీ వ్యయం తగ్గుతుంది. చైనా నుంచి ఇండియాకు ఐఫోన్ల తయారీని తరలించడం వల్ల అదనంగా 2 శాతం వ్యయం పెరుగుతుందని, అదే అమెరికాకు తయారీని తరలిస్తే ఈ వ్యయం 30 శాతానికి పెరుగుతుందని జీటీఆర్‌ఐ నివేదిను ఉద్దేశించి జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
ప్రతి ఐఫోన్ పై యాపిల్ కంపెనీకి ప్రస్తుతం 450 డాలర్ల ఆదాయం పొందుతోంది. అదే అమెరికాలో ఐఫోన్ల తయారీని చేపడితే కంపెనీకి ఒక్కోఫోన్‌పై కేవలం 60 డాలర్ల ఆదాయం మాత్రమే సమకూరుతుంది. అనేక సంవత్సరాలుగా యాపిల్ ఐఫోన్లను ఆసియా దేశాల్లోనే తయారు చేస్తోంది. ట్రంప్ హెచ్చరికలతో కంపెనీ అమెరికాలో తయారీని చేపట్టాలంటే ఎంతో ఖర్చు, రిస్క్‌తో కూడుకుని ఉంటుందని జీటీఆర్‌ఐ నివేదిక స్పష్టం చేసింది.
యాపిల్ సప్లయ్ చెయిన్ కూడా దెబ్బతింటుంది. బెంగళూర్ సమీపంలో ఇప్పటికే ఫాక్స్‌కాన్ 300 ఎకరాల్లో అతి పెద్ద ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఐఫోన్ల తయారీ కోసం ఈ సంస్థ 3.56 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. మొదటి దశలో 3వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. 2025 డిసెంబర్ నాటికి ఈ ప్లాంట్ నుంచి ఐఫోన్ల తయారీ ప్రారంభం కానుంది. 30 వేల మంది కార్మికులు పని చేయనున్నారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడి యాపిల్ కంపెనీ ఇండియాలో ఐఫోన్ల తయారీని నిలిపివేసే అవకాశం లేదు. ఇండియాలో ఫాక్స్‌కాన్‌తో పాటు టాటా టెక్నాలజీస్ కూడా భారీ ఎత్తున ఐఫోన్లను తయారు చేయనుంది.