TG | గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ – కవిత లేఖపై మంత్రి పొన్నం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉందని బీసీ సంక్షేమ, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌ లో నేడు మీడియాతో మాట్లాడుతూ ఏనాడు బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆ రెండు పార్టీల వ్యవహారం గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా ఉందని మండిప‌డ్డారు. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ ను ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే.. రాజకీయం అన్నారని.. ఇప్పుడు అదే విషయంలో కేసీఆర్‌ కూతురే అడుగుతుంద‌ని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ, బీఆర్ఎస్ ర‌హ‌స్య ఒప్పందాలు
ఇటీవల కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని మంత్రి ప్ర‌భాక‌ర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గులాబీ పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ‌పై కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయిందని, అందుకే అన్ని విషయాలను ఆమె లేఖ ద్వారా బయటపెట్టిందని అన్నారు. కవిత రాసిన లేఖపై కేటీఆర్‌ తో పాటు హరీశ్ రావు కూడా సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం అన్నారు.

Leave a Reply