MI vs DC | ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లిన ముంబై – ఢిల్లీ ఇక ఇంటికే !

ఐపీఎల్లో భాగంగా నేడు జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై ఘన విజయం సాధించింది. ఈ విజ‌యంతో ప్లేఆఫ్స్ బర్త్ ఖరారు చేసుకున్న ముంబై… ఇప్పటికే అర్హత పొందిన గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్ల సరసన చేరింది. ఈ పరాజయంతో ఢిల్లీ జట్టు టోర్నమెంట్‌కి గుడ్‌బై చెప్పింది.

ఈరోజు ముంబై గ్రౌండ్ వాంఖ‌డే వేదిక‌గా జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల విజయలక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. బౌలర్ల ధాటికి తలొగ్గిన ఢిల్లీ 121 పరుగులకే కుప్ప‌కూలింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ 59 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది.

కాగా, ముంబై నిర్ధేశించిన టార్గెట్ ఛేదించ‌డంలో ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు 4.2 ఓవర్లలో కేవలం 27 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లను కోల్పోయింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషేక్ పోరేల్ (6) స్వల్ప స్కోర్లు చేసి పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత వచ్చిన స‌మీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగ్గం (20) మంచి ప్రయత్నం చేసినా, ముంబై బౌలర్ల దెబ్బ‌కు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. మిగిలిన ఆటగాళ్లు ట్రిస్టన్ స్టబ్స్ (2), అషుతోష్ శర్మ (18), మాధవ్ తివారీ (3) అంచనాలను అందుకోలేకపోయారు.

ముంబై బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు, జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, క‌ర‌ణ్ శ‌ర్మ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్స్ బరిలోకి అడుగుపెట్టగా, ఢిల్లీ జట్టు సీజన్‌కి వీడ్కోలు చెప్పింది.

Leave a Reply