హైదరాబాద్ – భాగ్యనగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మియాపూర్, హైదర్‌నగర్‌లో ఉద్రిక్తతల నడుమ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
వివరాలలోకి వెళితే కూకట్ పల్లి మండలం హైదర్ నగర్ డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన 79 మంది బాధితులకు న్యాయం చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్లో 79 మంది బాధితులకు ఈ స్థలం చెందుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినా కబ్జాదారులు స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో బాధితులంతా హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
కూకట్ పల్లి మండలం హైదర్ నగర్ డివిజన్ లోని సర్వే నెంబర్ 145లో 9 ఎకరాల 27 గుంటల స్థలంలో డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్ విస్తరించింది. ఇందులో మధ్యతరగతి ప్రజలు 79 మంది 2000 సంవత్సరంలో ప్లాట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలం తనదని శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరి కొంతమందితో కలిసి ఆక్రమణకు పాల్పడ్డాడు. అనంతరం ప్లాట్ల యజమానులను స్థలంలోకి రాకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు.
దీంతో బాధితులందరూ కోర్టుకు వెళ్లి 2024 సెప్టెంబర్లో స్థలాలను దక్కించుకున్నారు. న్యాయస్థానం ప్లాట్ల యజమానులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కబ్జాదారులు స్థలాన్ని ఖాళీ చేయలేదు. బాధితులను లేఅవుట్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో వారంతా హైడ్రాకు ప్రజావాణిలో గోడును వెలిబుచ్చారు. ఈక్రమంలో హైడ్రా సోమవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టింది. దీంతో ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మియాపూర్ లోనూ ఆక్రమణలను ఈరోజు తొలగించారు.