- పురాణపండ గ్రంథావిష్కరణలో సురభి వాణీదేవి ప్రశంస
హైదరాబాద్ (ఆంధ్రప్రభ) : శ్రీనివాస్ రచనలు, సంకలనాల వెనుక ఉన్న అనుష్టాన బలమే దేశదేశాల్లోని తెలుగువారికీ, ఈ దేశంలోని తెలుగు భక్త పాఠకులకు అపురూపమైన అద్భుత దైవీయ గ్రంథాలను అందజేస్తోందని భారత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుమార్తె, తెలంగాణ శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి ప్రశంసలు వర్షించారు.
ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ నాలుగు వందలపేజీల అఖండ రచనా సంకలనం శ్రీమాలిక పదహారవ పునర్ముద్రణ సంచికను శనివారం త్యాగరాయ గానసభలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. సరస్వతీ పుష్కరాల ప్రత్యేక పవిత్ర సందర్భంలో ఈ శ్రీమాలికను ఇంకా అపురూపమైన అంశాలతో తీర్చిదిద్దడమే కాకుండా, పురాణపండ అందించిన కొన్నిఘట్టాలు మనస్సును భక్తి పారవశ్యానికి గురి చేశాయని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ సనాతనధర్మంలోని అద్వైతఅంశాలను వ్యాపార కాలుష్యం లేకుండా పవిత్రంగా అందరికీ అందుబాటులోకి అపూర్వ గ్రంథాల ద్వారా తీసుకెళ్లే విషయంలో పురాణపండ శ్రీనివాస్ ధార్మిక చైతన్యం ఆషామాషీ విషయం కాదని, దైవబలంతోనే సాధ్యమని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ పరమాద్భుత శ్రీకార్యాలకు సహకరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కేవీ.రమణాచారి, శ్రీఅమృతేశ్వర ఆలయం చైర్మన్ సాయి కొర్రపాటి తదితర ప్రముఖులకు జనార్ధనమ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. శ్రీమాలిక అపురూప అఖండ గ్రంథ రహాయిత పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ మానసిక పరిణతికి, మానవీయమైన అనుభూతి సాంద్రతకి, ఆధ్యాత్మిక రహస్యావిష్కరణకి, కార్యసాధనకీ అక్షర సంస్కారమే ఒక నిదర్శనమని వివరించారు.
ఈ కార్యక్రమంలో త్యాగరాయ గానసభ త్యాగరాయ గానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి, సభ్యులు గుండవరపు గీతాదేవి, నగర ప్రముఖులు బండి శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.