కర్నూలు బ్యూరో, మే 17 (ఆంధ్రప్రభ): జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక ఉపేక్షించేది లేదని జిల్లా విద్యాశాఖాధికారి యస్. శ్యామ్యూల్ పాల్ హెచ్చరించారు. ప్రధానంగా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుండి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం క్యాంపెయినింగ్ చేయించడం వంటి ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ విషయమై ఇకమీదట ఏ ఫిర్యాదు అందినా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రకటన సైతం విడుదల చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు నేరుగా ఫిర్యాదు చేస్తే వారి ఉద్యోగ భద్రత ఉండదనే ఉద్దేశ్యంతో ఆయా సంఘాలతో కార్యాలయానికి ఫిర్యాదులు పంపుతున్నారని, అంతే కాకుండా పాఠశాలలు తమ ప్రచారం నిమిత్తం ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి విషయాలను సీరియస్ గా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవిలో పాఠశాలలు నిర్వహించినా, అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులను ఇంటింటికి పంపి ప్రచారం చేయించినా, పాఠశాలల ప్రచారం నిమిత్తం ఫ్లెక్సీలు, అడ్వర్ టైజ్ మెంట్లు చేసినా పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ మాత్రమే అమలు చేయాలని, ఇష్టానుసారంగా పోటీ తత్వం పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తే ఆయా పాఠశాలలపై ఉక్కుపాదం మోపి అనుమతులు రద్దు చేయడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 22% ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ లో మార్పులను నమోదు చేయలేదని, అలాగే ఫారం -1 అప్లోడ్ చేయలేదని, 17.05.2025 (ఇవాళ సాయంత్రం 5.00 గంటల) లోపు మార్క్స్ నమోదు చేయడం, అలాగే ఫార్మ్ -1 అప్లోడ్ చేయడం పూర్తవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు మండల విద్యాధికారులు, డివిజనల్ ఉప విద్యాధికారులు సందర్శన లేదా తనిఖీ నిమిత్తం వచ్చినప్పుడు అడిగిన సమాచారాన్ని వెంటనే అందించాలని, సదరు విషయాలపై అన్ని యాజమాన్యాలు దృష్టి సారించి ప్రభుత్వ నిబంధనలను పాటించి నిబంధనలకు అనుగుణంగా పై ఆదేశాలను అమలు పరచాలని, నిర్లక్ష్యం వహించిన పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.