గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
ఎలిగేడు, మే 15 (ఆంధ్రప్రభ): వ్యవసాయ బావిలో సరదగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు గల్లంతు కాగా, మృతదేహం గురువారం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనిలోని జై భీమ్ నగర్‌కు చెందిన ముస్కే రాజీవ్ గాంధీ (35) బుధవారం తన స్నేహితులతో కలిసి ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ జాతరకు వచ్చారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి సాయంత్రం వ్యవసాయ బావిలోకి దిగారు. గాంధీకి ఈత రాకపోవడంతో బావిలో గల్లంతయ్యాడు.
వెంటనే స్నేహితులు బంధువులకు, స్థానికులకు సమాచారం అందించడంతో బావిలో గాంధీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం జూలపల్లి పోలీసులు, పెద్దపల్లి, గోదావరిఖని చెందిన రెస్క్యూ టీంతో వెతికించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు సింగరేణిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడికి తల్లి, అక్క, చెల్లి ఉన్నారు. గతంలోనే తండ్రి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు వెరకు జూలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.