ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఘటన
ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): మొన్న అఘోరిని ఓ యువతి ప్రేమించి వివాహం చేసుకుంది. ఇప్పుడు ఓ హిజ్రాను ముస్లిం యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికులను విస్తుపోయేలా చేసింది. సేకరించిన వివరాల ప్రకారం… కొండపల్లి కుమ్మరి బజారుకు చెందిన షేక్ బాజీ (24) బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడాది క్రితం బీ కాలనీ సమీపంలోని నేతాజీ నగర్ లో నివసిస్తున్న హిజ్రా గాదె కౌసల్య అలియాస్ షబానా (31)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఏడాది నుంచి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరువైపులా పెద్దల దృష్టికి తీసుకెళ్లి వివాహం చేయాలని కోరారు.
బాజీ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. దీంతో కౌసల్య తరపున హిజ్రా పెద్దలు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమ జంట బాజీ, కౌసల్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోయారు. బాజీ తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అనడంతో అతను ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మంగళవారం రాత్రి హిజ్రా గురువమ్మ, మరికొంత మంది హిజ్రాలు, బాజీ స్నేహితుల సమక్షంలో నేతాజీ నగర్ లో స్టేజీ ఏర్పాటు చేసి ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో బాజీ, కౌసల్య అలియాస్ షబానా పెళ్లి చేసుకున్నారు. వారికి హిజ్రాలు ఆశ్వీరచనాలు అందజేశారు. వీరి వివాహ కార్యక్రమాన్ని స్థానికులు తిలకించారు. సమాజంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తారని, అలాంటిది ఓ ముస్లిం యువకుడు ముందుకు వచ్చి హిజ్రాను జీవిత భాగస్వామిగా చేసుకోవడం తమకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని హిజ్రాలు తెలిపారు. హిజ్రాలు గర్వపడేలా దగ్గరుండి వివాహాన్ని జరిపించామన్నారు.