PM in Airbase | అదంపూర్ ఎయిర్ బేస్ లో మోదీ – వైమానిక సిబ్బందితో మాటామంతి

వారి ధైర్య సాహసాలకు ప్రశంసలు
దేశం అంతా మీ వెంటే ఉందన్న ప్రధాని
ఎక్ ఖాతాలో ఫోటోలను పంచుకున్న మోదీ

అదంపూర్ ‍‍ ‍‍‍- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్‌లోని అదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఐఏఎఫ్‌ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైమానిక దళ సిబ్బంది ఆయనకు స్థావరం వద్ద భద్రతా పరిస్థితి గురించి వివరించారు. కాగా, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారని ప్రశంసించారు. పాకిస్తాన్ భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తూనే.. తమ దాడిలో ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని పేల్చివేశామని చెప్పిన విషయం తెలిసిందే.

కానీ ప్రధానమంత్రి విమానం ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన తర్వాత, పాకిస్తాన్ వాదన పూర్తిగా అబద్ధమని రుజువైంది. ఎందుకంటే భారతదేశంలోని అత్యంత వివిఐపి విమానం ఈ ఎయిర్‌బేస్‌లో విజయవంతంగా ల్యాండ్ అయింది. భారతదేశ యుద్ధ విమానం మిగ్ 29 కి అదంపూర్ ఎయిర్‌బేస్ స్థావరం. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ప్రధాని వెంట ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఆదంపూర్ వైమానిక స్థావరం, శత్రువులపై మెరుపు దాడికి ప్రసిద్ధి చెందింది.

ఈ సందర్బంగా ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక పాత్ర పోషించారని సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. పాక్‌కు భారత్‌ సత్తా చూపించారని ఆయన కొనియాడారు. ఇక ఎక్స్‌ ఖాతాలో ప్రధానమంత్రి జవాన్లతో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీనిని “చాలా ప్రత్యేకమైన అనుభవం” అని అభివర్ణించారు. “ఈ రోజు ఉదయం నేను ఆదంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను, సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం , నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారతదేశం వారికి ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటుంది” అని ప్రధానమంత్రి అన్నారు.

Leave a Reply