న్యూ ఢిల్లీ – భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం పంజాబ్ ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) దాటేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గురువారం బీఎస్ఎఫ్ హతమార్చింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ప్రకారం, చొరబాటుదారుడు రాత్రి సమయంలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించారు. బీఎస్ఎఫ్ దళాలు వార్నింగ్ ఇచ్చినప్పటికీ, ఆ వ్యక్తి బోర్డర్ దాటేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. దీంతో అతడు స్పాట్ లోనే మరణించాడు..
చొరబాటుకు మరో వ్యక్తి ప్రయత్నం … అరెస్ట్
కాగా, ఈ వారం ప్రారంభంలో కూడా ఇలాగే ఓ పాకిస్తానీయుడు పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అతడిని బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. ఆ వ్యక్తిని మహ్మద్ హుస్సేన్‌గా గుర్తించారు. అప్పటి నుంచి అతను పంజాబ్ పోలీసులు కస్టడీలో ఉన్నాడు. అతడి వద్ద నుంచి పాక్ కరెన్సీ, పాక్ గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రాజస్థాన్ సరిహద్దుల్లో ఇలాగే ఓ పాక్ రేంజర్ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించడంతో మన భద్రతా బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఇతను గూఢచర్యం కోసం ప్రవేశించి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.