AP | కనకదుర్గమ్మ ఆలయంలో పూర్ణాహుతి
(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : శ్రీ క్రోధి సంవత్సర మగశుద్ధి పంచమి సందర్భంగా సరస్వతి దేవి అలంకరణలో కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ పంచమి సందర్భంగా సోమవారం విజయవాడలోని అందరికీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ సరస్వతీ దేవిగా ప్రత్యేక అలంకరణలో భక్తులను కనువిందు చేశారు. జ్ఞానప్రదాయని వాగ్దేవి అయిన సరస్వతి దేవిని పూజిస్తే జ్ఞాన సిద్ధి కలిగి చైతన్యవంతులవుతారని వేదాలు చెబుతున్నాయి.
సరస్వతి దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున కొండకు తరలివచ్చారు. స్కూల్, కళాశాల యూనిఫాంలో వచ్చిన విద్యార్థులకు దేవస్థానం అధికారులు ఉచితంగా దర్శనభాగ్యాన్ని కల్పించారు. వీరి కోసం ప్రత్యేక క్యూలైన్లను సైతం ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం విద్యార్థులకు పెన్ను, అమ్మవారి ప్రతిమ, రక్ష, లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు.
దేవస్థానంలో కొత్తగా నిర్మించిన యాగశాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం నిర్వహించిన ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు వేద పాఠశాల విద్యార్థులు, వేద పండితులు పాల్గొన్నారు.