Spy Arrest |పాక్ కి మన ఆర్మీ సమాచారాన్ని అందజేస్తున్న ఇద్దరు దేశద్రోహులు అరెస్ట్

శ్రీనగర్, ఆంధ్రప్రభ :పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని, వారికి సాయం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా, ఉగ్రవాదుల కట్టడి, పహల్గామ్ నిందితులను నిర్బందించే క్రమంలో కేంద్ర మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారం పాకిస్తాన్కు లీక్ అయ్యిందని తెలుస్తోంది. భారత్ ఆర్మీకి చెందిన పలు ఫొటోలతో సహా కీలక సమాచారం పాక్కు చేరవేస్తున్న ఇద్దరు గూఢచారులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫొటోలతో సహా పాక్కు చేరవేత

.అయితే.. ఈ విషయంలో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు అమృత్సర్లో ఆదివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పాక్ నిఘా అధికారులకు సమాచారం చేరవేసినట్లు అంగీకరించినట్టు సమాచారం. అమృత్‌సర్‌లోని కంటోన్మెంట్ ఏరియాతోపాటు ఎయిర్ బేస్‌కు సంబంధించిన పలు చిత్రాలను వీరు పాకిస్తాన్ అధికారులకు అందజేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

నిందితులు పాలక్ షేర్ మాసిహ్, సురజ్ మాహిష్‌ అని వెల్లడించారు. అమృత్‌ సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టూ, హ్యాపీ సూచనల మేరకు తాము ఈ పనిచేసినట్లు చెప్పారు. అధికారిక రహస్యాల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపాయి.

Leave a Reply