ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు ఛైర్మన్ గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేశారు.
జాతీయ భద్రత సలహా మండలిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసింది. ఇప్పుడున్న సభ్యులందరినీ తొలగించింది. వారిపై వేటు వేసింది. కొత్త ముఖాలకు చోటు కల్పించింది.జాతీయ భద్రత సలహాదారుగా అజిత్ దోవల్‌ను కొనసాగిస్తూనే సలహా మండలిలో పెను మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం.
మొత్తం ఏడుమంది సభ్యులు ఉండే జాతీయ భద్రత సలహా మండలి ఇది. ఇందులో ఆర్మీ, పోలీస్, విదేశీ వ్యవహారాలకు చెందిన రిటైర్డ్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించింది.జాతీయ భద్రత సలహా మండలి కొత్త ఛైర్మన్‌గా అలోక్ జోషి అపాయింట్ అయ్యారు. గతంలో ఆయన రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (RAW) చీఫ్‌గా పని చేశారు. పాకిస్తాన్ సహా వివిధ దేశాల రాజకీయ పరిణామాలు, ఉగ్రవాదుల కదలికలు, భౌగోళిక స్థితిగతులపై అలోక్ జోషికి గట్టి పట్టు ఉంది. అజిత్ దోవల్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తారాయన.
వెస్ట్రన్ ఎయిర్ మాజీ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎ సిన్హాతో పాటు పలువురు ఈ సలహా మండలి సభ్యులుగా నియమితులు అయ్యారు. మిలటరీ సర్వీసుల నుంచి సలహా మండలి సభ్యులుగా నియమితులైన వారిలో రిటైర్డ్ అత్యున్నత అధికారులు సదరన్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఉన్నారు.అలాగే- పోలీస్ విభాగం నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్‌లకు ఈ బోర్డులో చోటు లభించింది. అదే సమయంలో- ఫారిన్ సర్వీసుల నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీ వెంకటేష్ వర్మను ఈ జాతీయ భద్రత సలహా మండలిలోకి తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేసింది.