ఉమ్మడి గుంటూర్, ఆంధ్ర ప్రభ బ్యూరో : గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. నగర ప్రజలు ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. వైసిపి మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో నూతన మేయర్ ఎన్నిక కు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కొంతమంది వైసిపి కార్పొరేటర్లు టిడిపి, జనసేనలోకి వలస వెళ్లారు. దీంతో కూటమి అభ్యర్థి మేయర్ పీఠం ఖాయమని భావించారు. అయితే హఠాత్తుగా వైసిపి మేయర్ అభ్యర్థిని బరిలో కి దించడంతో క్యాంపు రాజకీయాలు నడిపారు. గత మూడు రోజులుగా కూటమి వైసిపి కార్పొరేటర్ లను క్యాంపులకు తరలించి జాగ్రత్త పడ్డారు. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి, వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించిన…చివరకు కూ టమి పై చేయిగా నిలిచింది. కూటమి మేయర్ అభ్యర్థిగా టిడిపి సీనియర్ నేత కోవెలమూడి నానిని పార్టీ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అయితే వైసిపి చివరిలో 30 డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని ప్రకటించడంతో ఎన్నికనివార్యమైంది. ఎన్నికల నిబంధనల మేరకు జరిగిన మేయర్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకుంది.
ప్రశాంతంగా ఎన్నిక..
గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా
ముగిసింది. గుంటూరు నగర మేయర్ గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ప్రకటించారు.వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన అచ్చాల వెంకటరెడ్డికి 27 మంది మద్దతు తెలుపగా…. కొములమూడి రవీంద్ర కు 34 మంది మద్దతు తెలిపారు.వైసిపి కార్పొరేటర్లు యాట్ల రవి, మర్రి అంజలి గైరహాజరయ్యారు.ఈ ఎన్నికలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, మొహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు మద్దతు తెలిపారు. కూటమి నేతలు ప్రకటించినట్లుగానే గుంటూరు మేయర్ స్ధానాన్ని దక్కించుకొన్నారు. దీంతో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూటమి నేతలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
నగరాభివృద్ధికి కృషి: నాని..
గుంటూరు నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) తెలిపారు. ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని జిల్లా కేంద్రమైన గుంటూరు నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ల సహకారంతో నగర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు.
