Condemned | అన్ని విధాల అండగా నేనుంటా .. మ‌ధుసూధ‌న్ కుటుంబానికి పవన్ భరోసా

కావ‌లి – ప‌వాల్గాం ఉగ్ర‌వాద దాడి హేయ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ .. ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడేందుకు త‌న‌కు మాట‌లు కూడా రావ‌డం లేద‌న్నారు.. ఈ ఉగ్ర‌వాద కాల్పుల‌లో మ‌ర‌ణించిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ మ‌ధుసూధ‌న్ రావు అంత్య‌క్రియ‌ల‌ను నేడు కావ‌లిలో నిర్వ‌హించారు.. ఈ అంత్య‌క్రియ‌ల‌లో ప‌వ‌న్ స్వ‌యంగా పాల్గొని మృతుడికి కడ‌సారి వీడ్కొలు ప‌లికారు..

నేటి మ‌ధ్యాహ్నం కావ‌లి చేరుకున్న ప‌వ‌న్ నేరుగా మ‌ధుసూధ‌న్ ఇంటికి చేరుకున్నారు.. అక్క‌డ ఉన్న మ‌ధుసూధ‌న్ బౌతిక‌కాయంపై పూల‌గుచ్చం ఉంచి నివాళ‌ల‌ర్పించారు.. ఈ సంద‌ర్భంగా మ‌ధు కుటుంబ స‌భ్యుల‌ను పరామ‌ర్శించారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ప్ర‌భుత్వం అన్ని విధాల అదుకుంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.. ఈ కాల్పుల ఘ‌ట‌న వివ‌రాల‌ను బాధిత కుటుంబ స‌భ్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా అక్క‌డి జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను మ‌ధు సూధన్ భార్య వివ‌రించారు.. మోడీ హయాంలో కశ్మీర్ సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతోనే తాము విహారయాత్రకు వెళ్లామని, కానీ ఇంతటి దారుణం జరుగుతుందని ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కుటుంబాలకు చెందిన పది మంది పహల్గాం విహారయాత్రకు వెళ్లారు. స్థానికంగా ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలిచే ప్రాంతానికి గుర్రాలపై వెళ్లి, భోజనం చేశారు. మధుసూదన్, ఆయన భార్య ఇద్దరూ భోజనం ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే కాల్పుల శబ్దాలు వినిపించాయి.

మిస్ గైడ్ తోనే ….

భయంతో వారు పరుగులు తీస్తుండగా, శాలువాలు అమ్మే కొందరు స్థానికులు వారిని అడ్డుకొని, అవి కేవలం కశ్మీరీ వార్షికోత్సవ వేడుకల శబ్దాలని, భయపడాల్సిన పనిలేదని చెప్పి తప్పుదోవ పట్టించినట్లు ఆమె తెలిపారు. “మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్‌గైడ్ చేస్తూ అది కేవలం వేడుకలని, ఇక్కడే ఉండండి అన్నారు” అని ఆమె పేర్కొన్నారు. అయితే, అక్కడే ఉన్న ఒక హోటల్ యజమాని మాత్రం ప్రమాదాన్ని పసిగట్టి, తమ పిల్లలను, ఇతరులను వెంటనే పారిపోవాలని హెచ్చరించినట్లు చెప్పారు. హోటల్ యజమాని హెచ్చరికతో పిల్లలు, కొందరు ముందుగానే పారిపోయారని, కానీ తాము పారిపోయేలోపే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ దగ్గరకు వచ్చారని మధుసూదన్ భార్య వివరించారు.

ఆ సమయంలో తన భర్త, “మనమిద్దరం ఇక్కడే పడుకుందాం, నువ్వు తల ఎత్తవద్దు” అని చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ చేతులు పట్టుకుని నేలపై పడుకుని ఉండగా, ఎవరో నడుచుకుంటూ వచ్చిన శబ్దం వినిపించిందని, వెంటనే ఒక పెద్ద పేలుడు శబ్దం (కాల్పుల శబ్దం) వినిపించిందని తెలిపారు. “ఆ షాట్‌కు ముందు ‘హిందూయే? ముస్లిమే?’ అని రెండు సార్లు అడిగారు. మేము ఏమీ స్పందించలేదు. వెంటనే షాట్ సౌండ్ వినిపించింది. నేను లేచి చూసేసరికి ఆయన ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది” అని చెబుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయని, ఆ షాట్ తమవైపే జరిగిందని అప్పుడు అర్థమైందని ఆమె వాపోయారు.

తన భర్తను కాల్చిన తర్వాత, తాను కూడా బయటకు పరిగెత్తానని, ఎవరైనా రక్షించేవారు కనిపిస్తారేమోనని చూశానని, కానీ ఎవరూ కనిపించలేదని ఆమె తెలిపారు. అక్కడున్న కొందరు తనను ఆర్మీ క్యాంప్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని, తమ పక్కనే ఉన్న జైపూర్‌కు చెందిన దంపతులు తమ రెండేళ్ల చిన్నారిని చూపిస్తూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించకుండా కాల్చి చంపారని ఆమె వివరించారు. “నన్ను కూడా కాల్చేయమని అడిగితే, ‘మోదీకి చెప్పుకోండి’ (మోదీ కో బోలో) అని అంటున్నారని” ఆమె ఆవేదనతో తెలిపారు. కిందపడిపోయిన వ్యక్తిని సైతం మరోసారి కాల్చారని ఆమె ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని వివరించారు. తన భర్తకు ఒకే ఒక్క బుల్లెట్ తగిలిందని, 46 బుల్లెట్లు తగిలాయనే వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు.

“మోదీ పాలనలో కశ్మీర్ సురక్షితం అనుకునే వెళ్ళాం. కానీ మాకే ఇలా జరుగుతుందని ఊహించలేదు. మా నష్టాన్ని ఎవరు తీర్చగలరు?” అని ఆమె ప్రశ్నించారు. తమలాగే అనేక కుటుంబాలు బాధితులయ్యాయని, కొందరు పిల్లలకు తల్లిదండ్రులు చనిపోయిన విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఏ విధంగా సహాయం చేస్తుందోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

మధుసూదన్ కుమారుడు మాట్లాడుతూ, తాము గేటు బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తుండగా, కేవలం అమ్మ మాత్రమే తిరిగి వచ్చిందని, నాన్న రాలేదని చెప్పాడు. చెన్నైలో తన తండ్రి పార్థివ దేహానికి అంతమంది సైనికులు సెల్యూట్ చేయడం చూసి గర్వపడ్డానని, తన తండ్రి కోసం, కుటుంబం కోసం ధైర్యంగా ఉంటానని ఆ బాలుడు పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *