AP | పెద్దిరెడ్డి అడ్డాలో గర్జించనున్న మెగా బ్రదర్ !
- కందూరులో జనసేన భారీ బహిరంగ సభ
- భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు) : మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు జనగర్జనకు సిద్ధమవుతున్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో ఆదివారం జరిగే జనసేన బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
ఈ మేరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక నాగబాబు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనసైనికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు బలగాలను భారీగా మోహరిస్తున్నారు.
కాగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట సమీపంలో అడవి భూములను ఆక్రమించాలని వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో జరుగుతున్న జనసేన బహిరంగ సభకు ప్రాధాన్యత చేకూరింది. పెద్దిరెడ్డికి కంచుకోట అయిన సోమల మండలంలో భారీ ఎత్తున జనసేన బహిరంగ సభ జరగనుండడంతో ఆ మండలంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, తిరుపతి ఎమ్మేల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఇతర నాయకులు పాల్గొంటారు.