నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో భైరవాణి చెరువులో తవ్వకాలు చేస్తే తమకు సాగునీరు, తాగునీటికి దిక్కు ఉండదని రైతులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి నష్టం జరిగే అనుమతులను వెంటనే రద్దు చేసి భైరవాణి చెరువును కాపాడాలంటూ తమ గ్రామంలోని భైరవాణి చెరువు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ఇరిగేషన్ అధికారులు రైల్వే కాంట్రాక్టర్ కు ఒక లక్ష క్యూబిక్ మీటర్లు అంటే దాదాపుగా 30వేల ట్రిప్పర్ల మట్టిని ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే అంత కంటే ఎక్కువ మట్టిని చెరువు నుంచి తోలుకున్నారు. అలాగే తోలుతూ ఉంటే తమ గ్రామ చెరువు మట్టితో పాటు తాము కూడా అదే ట్రిప్పర్ల కింద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలోని భైరవాణి చెరువులో మట్టి చూడటంతో నిల్వ ఉండాల్సిన నీరు బయటకు వెళ్ళిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధింత జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని తమ గ్రామానికి సంబంధించిన భైరవాణి చెరువుకు మట్టితోలుకోవడానికి ఇచ్చిన పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని, లేనియెడల రైతుల ఆత్మహత్య శరణ్యమని వారు పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేసి చూడాల్సిందే.