మర్రిగూడ, ఏప్రిల్ 22 (ఆంధ్రప్రభ): మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జడ్పిహెచ్ఎస్ యరుగండ్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి తోటి సిబ్బందితో కలిసి గత వారం రోజులుగా తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి, అజ్జాలపురం, యరుగండ్లపల్లి, కొండూరు, పడమటి తండా గ్రామాల్లో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రుల ఇంటి దగ్గరకు వెళ్లి వారికి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే డిజిటల్ క్లాస్ రూమ్స్, మినరల్ వాటర్, ఉచిత దుస్తులు, ఉచిత పుస్తకాలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడం జరుగుతుందని వారికి తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలకు పంపి ఆర్థికంగా నష్టపోకూడదని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని తల్లిదండ్రులను కోరారు. ఫీజు రూపంలో ప్రవేట్ పాఠశాలల్లో చెల్లించే నగదును పొదుపు చేసినట్లయితే భవిష్యత్తులో పిల్లల పై చదువులకు ఉపయోగపడుతుందని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, వాసుదేవరావు, మూర్తి, పెంటావతి, శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, దివ్య, జ్యోతి, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, పాల్గొన్నారు.