భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులు
శృంగేరి పీఠం అనుమతులతో పునర్నిర్మాణం పనులు
దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
వేములవాడ, ఆంధ్రప్రభ :
వేములవాడలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. గురువారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, ఈఓ వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ అభివృద్ధికి రూ.38 కోట్లు మంజూరు
దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్ల ప్రకటించారని అన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.
ఆలయ విస్తరణ పనులకు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ.76 కోట్లు, అన్నదాన సూత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు. అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడ్తున్నామని అన్నారు. రాబోయే నెలలో రొడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు…
శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేకం మండపం, కోడె కట్టుట, క్యూ లైన్ తదితరు ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, ఈఓ వినోద్, ఈఈ రాజేశ్, డీఈ రఘు నందన్, ఆర్అండ్ బీ సీఈ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ ఎలక్ట్రికల్ లింగారెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ బీ లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకట రమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.