Japan Tour | జపాన్ చేరుకున్న రేవంత్ రెడ్డి . ఎయిర్ పోర్ట్ లో సాద‌ర‌పూర్వ‌క స్వాగ‌తం ..

నారిటా – జ‌పాన్ – ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరిన బృందం ఈ రోజు మధ్యాహ్నం నారిటా ఎయిర్‌పోర్ట్ దిగారు . విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు సాద‌ర‌పూర్వ‌క స్వాగ‌తం పలికారు అక్క‌డి అధికారులు..కాగా ఆయ‌న ప‌ర్య‌ట‌న ఈ నెల 22 వరకు కొనసాగ‌నుంది. ఈ పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు.

ఆయ‌న‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా ఉన్నారు..ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. ఈ ఎక్స్‌పోలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యం. ఈ పర్యటన ఫలితాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంద‌ర్బంగా రేవంత్ బృందం వివిధ రంగాల‌కు చెందిన పారిశ్రామిక వేత్త‌ల‌తో భేటి కానుంది.. వారికి తెలంగాణ‌లో పెట్టుబ‌డుల అవ‌కాశాలు… ప్ర‌భుత్వ ప‌రంగా ఇస్తున్న ప‌లు రాయితీల‌ను వివ‌రించ‌నున్నారు..

ఇక అధునాతన సాంకేతికత, ఆర్థిక స్థిరత్వం కలిగిన దేశం కావడంతో, అక్కడి కంపెనీలతో ఒప్పందాలు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. గతంలో రేవంత్ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో 31,500 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు. ఈ నేపథ్యంలో, జపాన్ పర్యటన కూడా ఇలాంటి విజయాన్ని అందిస్తుందని ఆశాభావం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో సహకారం పెరిగే అవకాశం ఉంది

ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు దోహదపడుతుంది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర సంస్కృతి, సామర్థ్యాలను ప్రదర్శించడం ద్వారా టూరిజం, వాణిజ్య రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో, జపాన్‌తో సాంకేతిక భాగస్వామ్యం తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. జపాన్ నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణలలో ముందుండటంతో, ఈ సహకారం రాష్ట్ర యువతకు నూతన దిశను అందించవచ్చు. అయితే, ఈ పర్యటన విజయం అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది. ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా, ఆచరణలోకి వస్తేనే నిజమైన ఫలితాలు కనిపిస్తాయి. గతంలో పలు ప్రభుత్వాలు పెట్టుబడులు తెచ్చినప్పటికీ, అమలులో జాప్యం వల్ల ప్రయోజనం పూర్తిగా దక్కలేదు. రేవంత్ ఈ అంశంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటే, జపాన్ పర్యటన తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *