TG | ఎవడు అడ్డు వచ్చినా సామాజిక సంస్కరణలు ఆపేది లేదు – ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక సంస్కరణలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఎవడు అడ్డువచ్చినా ఆగే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమ‌వారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాలలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ ఆర్థిక అసమానతలతో రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసిన కుహనా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆర్థిక రాజకీయ అరాచకత్వాలతో సంక్షోభం సృష్టించేందుకు పన్నాగం పన్నాయని అన్నారు.

దేశంలో భూసంస్కరణలతో పేద వర్గాలకు వెలుగులు నింపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ లోపాలను సవరించి పేద రైతులను ఆదుకునేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామన్నారు. అట్టడుగు వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించాలని లక్ష్యంతోనే కులగ‌ణ‌న‌ చేపట్టి దేశానికి రోల్ మోడల్ గా నిల్చామని భ‌ట్టి విక్రమార్క అన్నారు. రాహుల్ గాంధీ పిలుపుమేరకు సామాజిక పరివర్తన కార్యక్రమంలో భాగంగా జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కార్యకర్తలు ప్రజల్లోకీ వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి గ్రావిటీ ద్వారా బీడు భూములకు సాగునీరు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత డిజైనింగ్ మార్చి లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్ట నిర్మించిందని, అది కుంగిపోవడానికి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.

రెండేళ్ల కిందట ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి నుండి ప్రారంభించిన పాదయాత్ర ఖమ్మం వరకు కూడా సాగిందని, ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తో తనకున్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోనన్నారు. అంబేద్కర్ ఆశ‌ల‌మేర‌కు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, రాజకీయ చిత్తశుద్ధితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ వర్గాలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే బొజ్జు, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, జై బాపు జై భీమ్ సంవిధాన్ కోఆర్డినేటర్ రుద్ర సందీప్, సంతోష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *