ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్‌లు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు (బుధవారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. గుజరాత్ టైటాన్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టనుంది.
ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో గుజరాత్ – రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. అయితే, తొలి మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
మరోవైపు, ఈ సీజన్‌ను వరుసగా రెండు ఓటములతో ప్రారంభించిన రాజస్థాన్.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచి ట్రాక్‌లోకి వచ్చింది. దీంతో, రాజస్థాన్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
గుజరాత్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని రాజస్థాన్ చూస్తోంది. మరోవైపు, గుజరాత్ తన విజయ పరంపరను కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో, ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ టోర్నీల్లో గుజరాత్ టైటన్స్ – రాజస్థాన్ రాయల్స్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 6 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 6 మ్యాచ్‌ల్లో జిటి జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఆర్ఆర్ జట్టు 1 సార్లు గెలిచింది.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.