AICC | కులాలు,మ‌తాల మ‌ధ్య చిచ్చు రాజేస్తున్న మోడీ – రేవంత్ రెడ్డి

అహ్మ‌దాబాద్ – కులాలు, మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడుతున్నారని , దేశాన్ని విభజించాలని క‌మ‌ల‌నాధులు చూస్తున్నారని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు… దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చేసి రాహుల్‌ గాంధీ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మోడీ, బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అహ్మదాబాద్ లో జ‌రుగుతున్న ఎఐసిసి స‌మావేశాల రెండో రోజైన నేడు రేవంత్ మాట్లాడుతూ , మోడీ గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ ని అడుగుపెట్టనివ్వబోన‌ని అన్నారు. గతంలో బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టినట్లే బీజేపీనీ తరిమి కొట్టాలని.. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.

దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, కానీ వాస్తవంగా దేశ యువత నిరుద్యోగంతో తల్లడిల్లుతుందని వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరిగిందని ఆరోపించారు.

రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోడీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణకు స్వాతంత్య్రం రావడానికి వలభాయ్ పటేల్ పాత్ర ఎంతో గొప్పదని రేవంత్ గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ఏర్పాటు మాత్రం సోనియా గాంధీ ఆశయ ఫలమని తెలిపారు. బ్రిటిష్ వాళ్లు ఎలా దేశ సంపదను లూటీ చేశారో, అదే బాటలో బీజేపీ నాయకులు కూడా నడుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ఆస్తులు ప్రైవేటు కార్పొరేట్‌లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. వచ్చే రోజుల్లో దేశం మీద విపరీతంగా పెరుగుతున్న బీజేపీ చెరను తొలగించాలన్న బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *