BRS Party | ఓరుగ‌ల్లు స‌భ‌కు రండి! బొట్టు పెట్టి.. చీర‌లిచ్చి.. పిలుపు

ఇంటింటికి బీఆర్ఎస్ శ్రేణుల ఆహ్వానం
ఊరంతా పండ‌గలా ఆహ్వాన ప‌త్రిక‌ల పంపిణీ
సారే రావాలి… సారే కావాలి… అంటూ ముఖరా-కె గ్రామస్తుల పూజలు

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఓరుగ‌ల్లులో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్‌ రజతోత్సవ వేడుకకు ఆ గ్రామ‌మంతా పండ‌గ‌లా క‌దిలేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ల‌క్షా 11 వేల రూపాయ‌లు విరాళంగా అంద‌జేశారు. ఇప్పుడు పండ‌గలా ఆహ్వాన‌ప‌త్రిక‌లు ఇంటింటికి అంద‌జేస్తున్నారు. అదే ఆదిలాబాద్ జిల్లా ముఖ‌ర కె గ్రామ‌స్థులు. గ్రామ సర్పంచ్ మీనాక్షి సుభాష్ ఇటీవల ఓరుగల్లు సభ నిర్వహణ ఖర్చులకోసం చందాలు వసూలు చేసి లక్షా 11 వేల విరాళాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందజేశారు. ముఖర – కె గ్రామస్తుల అభిమానానికి తెగ సంబరపడ్డ కేసీఆర్, కేటీఆర్ ఓరుగల్లు సభకు ప్రత్యేక అతిథులుగా రావాలని కబురు పంపారు.

ఇంటింటికీ ఆహ్వానం


ఓరుగల్లు రజతోత్సవ వేడుక తమ ఇంటి పండుగలా భావించిన గ్రామస్తులు బుధవారం ఆహ్వాన పత్రికలను ముద్రించి వాటికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు గావించారు. తిరిగి సారే రావాలి.. సారే కావాలంటూ శివాలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచన మేరకు సర్పంచ్ మీనాక్షి సుభాష్ తమ ఇంటి పార్టీ రైతు ఉత్సవ వేడుకకు రావాలని సాదరంగా ఆహ్వానిస్తూ ఆడపడుచులకు బొట్టు పెట్టి.. చీరలు ఇచ్చి ఆహ్వాన పత్రికలతో పండగలా సందడి చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ గ్రామాల రూప రేఖలు మార్చిన కేసీఆర్‌ కు ఎల్లవేళలా అండగా ఉంటామని గ్రామస్తులంతా తేల్చి చెప్పారు. కుటుంబాలతో కలిసి ఓరుగల్లు సభకు పండగలా వెళ్తామని సంబరంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *