కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, విప్ దివకొండ దామోదర్ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి కలిశారు.
పార్లమెంటు ఆవరణలోని మంత్రి చాంబర్‌లో ఈరోజు (మంగళవారం) సాయంత్రం ఆయనతో ఎంపీలు సమావేశమై తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు.
వరంగల్‌లోని మామూనూరు విమానాశ్రయం పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు. నిజాం కాలంలో నిర్మించిన మామూనూరు నుంచి గతంలో విమానాలు నడిచాయని, ఇక్కడి నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే వరంగల్, చుట్టుపక్కల జిల్లాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి మంత్రి రామ్మోహన్ నాయుడుకు వివరించారు.
ప్రతిపాదిత విమానశ్రయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి..
అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపాన ప్రతిపాదిత విమానశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా వారు మంత్రిని కోరారు.
సింగరేణి ప్రధాన కార్యాలయంతో పాటు, నవభారత్, ఐటీసీ, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ వంటి అనేక పరిశ్రమలు అక్కడ నెలకొన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చేపోయే భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేసే విమానాశ్రయం సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి నాయుడుకు బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు వివరించారు.
అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల సమీపాన ప్రతిపాదిత విమానశ్రయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా ఎంపీలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.