పేదరికాన్ని జయించిన ప్రతిభ..

పేదరికాన్ని జయించిన ప్రతిభ..
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామానికి చెందిన రంగు మాధవి యాకయ్య దంపతుల కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వీరికి ఇద్దరు కుమార్తెలు రంగు కీర్తన, రంగు మేఘన ఉన్నారు. ఇందులో చిన్న కుమార్తె రంగు మేఘన హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ చైతన్య కాలేజీలో (బైపీసీ)మొదటి సంవత్సరం చదువుతూ 440 మార్కులకు 437 అద్భుతమైన మార్కులు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-యాకయ్య చిన్నప్పటి నుంచే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ:
పేద కుటుంబానికి చెందిన యాకయ్య చిన్నప్పటి నుంచే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగారు. కష్టాలు ఎంత వచ్చినా తన పిల్లలను బాగా చదివించాలనే లక్ష్యంతో కృషి చేస్తూ వచ్చారు. చదువు మాత్రమే జీవితాన్ని మార్చగలదనే నమ్మకంతో తన కుమార్తెలను ప్రోత్సహిస్తూ పెంచారు. ఆ తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా కుమార్తెలు రంగు కీర్తన, రంగు మేఘన కష్టపడి చదువుతూ ప్రతిభ చాటుతున్నారు. ముఖ్యంగా మేఘన సాధించిన ఈ విజయంతో వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. పేదరికం అడ్డంకి కాదు. పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలు సాధ్యమేనని రంగు మేఘన మరోసారి నిరూపించింది. ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.
