12aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
12aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

12aprSunday2026 | ఈ సంచికలో…
1.జలియన్‌వాలా బాగ్ ఊచకోత (ముఖచిత్ర కథనం)
2.కబుర్లు (శీర్షిక)
3.సన్నిహితం(శీర్షిక)
4.ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)
5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)
_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-
1.జలియన్‌వాలా బాగ్ ఊచకోత (ముఖచిత్ర కథనం)
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కొన్ని రోజులు కేవలం తేదీలుగా మిగిలిపోవు… కాలగర్భంలో కలిసిపోవు… జాతి మర్చిపోలేని జ్ఞాపకాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. కథలు కథలుగా దొర్లి తరతరాల వరకు మనసులను కదిలిస్తుంటాయి. ఆ ఘటనలో అమరులైన వారిని తరతరాలు స్మరించుకునేలా చేస్తాయి. అలాంటి దారుణ ఘట్టం జలియన్‌వాలా బాగ్ ఊచకోత. ప్రతి ఏడాది ఏప్రిల్ 13న ఈ ఘటనను స్మరించుకుంటూ అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటాం.
1919లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జోరందుకున్నాయి. ముఖ్యంగా రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని అమృతసర్ నగరంలోని జలియన్‌వాలా బాగ్‌లో వేలాది మంది నిరాయుధ ప్రజలు సమావేశమయ్యారు.

అయితే అదే సమయంలో బ్రిటిష్ సైన్యాధికారి రేగినాల్డ్ డైయర్ అక్కడికి చేరుకుని ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండా సైన్యానికి కాల్పుల ఆదేశాలు జారీ చేశాడు. బయటకు వెళ్లే మార్గాలు చాలా వరకు మూసుకుపోయిన ప్రదేశంలో చిక్కుకున్న ప్రజలపై జరిగిన ఈ కాల్పులు భయానకంగా మారాయి.
అధికారిక గణాంకాల ప్రకారం వందలాది మంది మరణించగా, అనధికారిక అంచనాలు వెయ్యికి పైగా ప్రాణనష్టం జరిగిందని చెబుతున్నాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కొందరు బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు కూడా చరిత్రలో నమోదు అయ్యాయి.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. బ్రిటిష్ పాలనపై భారతీయుల నమ్మకం పూర్తిగా కూలిపోయింది. స్వాతంత్ర్య ఉద్యమం మరింత ఊపందుకుంది. అహింసా మార్గంలో పోరాటం కొనసాగించిన మహాత్మా గాంధీ కూడా ఈ ఘటన తర్వాత ఉద్యమాన్ని మరింత బలపరిచారు.
అందుకే జలియన్‌వాలా బాగ్ ఘటన కేవలం ఒక దారుణం కాదు… భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అదొక కీలక మలుపు. భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను చూపిన చారిత్రక ఘట్టం. ప్రజలలో స్వేచ్ఛ కోసం పోరాడే తపనను పెంచిన సంఘటన.

ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు గోడలపై కనిపించే బుల్లెట్ల గురుతులు, బావి కథలు మనసును కలిచివేస్తాయి. ఆ అమరుల త్యాగం వల్లే మనకు ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించిందన్న సత్యాన్ని గుర్తు చేస్తాయి.
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేవి అంత తేలికగా లభించేవి కావు… అవి అనేక ధన, మాన, ప్రాణ త్యాగాల ఫలితం.
జలియన్‌వాలా బాగ్ దినోత్సవం మనకు ఇచ్చే బలమైన సందేశం ఇదే.
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
2 కబుర్లు (శీర్షిక)

శాంతి మీద మనసుంటే – సంధికి మార్గముంటుంది!
పూర్వం ఒక అడవిలో రెండు పెద్ద రాజ్యాలు ఉండేవి. ఒకటి సింహపురి, మరొకటి వ్యాఘ్రవనం. సింహపురి రాజు మహాబలుడు అనే సింహం, వ్యాఘ్రవనానికి రాజు విక్రముడు అనే పులి. ఈ రెండు రాజ్యాల మధ్య ఒక చిన్న నది సరిహద్దుగా ఉండేది. ఆ నది నీటి వాటా విషయంలో రెండు రాజ్యాల మధ్య గొడవ మొదలై అది చివరకు యుద్ధానికి దారితీసింది.
రెండు వైపులా సైన్యాలు సిద్ధమయ్యాయి. సింహాలు, పులులు ఒకరినొకరు చంపుకోవడానికి రొప్పుతూ గర్జిస్తున్నాయి. అప్పుడే ఆ అడవిలో ఉండే ఒక ముసలి జ్ఞాని అయిన ఏనుగు ‘గజపతి’ అక్కడికి వచ్చింది. అది రెండు సైన్యాల మధ్య నిలబడి అంది:
“ఓ రాజ్యాధిపతులారా! ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం? గెలిచిన వాడు శవాల మీద కూర్చుని రాజ్యం చేస్తాడు, ఓడిన వాడు మట్టిలో కలిసిపోతాడు. నిదానంగా ఆలోచించండి.”
మహాబలుడు గర్జిస్తూ, “న్యాయం నా వైపు ఉంది, నేను తగ్గేదే లేదు !” అన్నాడు. విక్రముడు కూడా “నేనూ యుద్ధానికే మొగ్గు చూపుతాను” అన్నాడు.
అప్పుడు గజపతి వారికి ఓ చిన్న ఉపమానం చెప్పింది:
“ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఒకే దుప్పటి కోసం కొట్టుకున్నారు. ఒకరు ఒక చివర, మరొకరు ఇంకో చివర పట్టుకుని గట్టిగా లాగారు. ఫలితంగా ఆ దుప్పటి చినిగి ముక్కలైపోయింది. చివరకు ఇద్దరికీ చలి ఆగలేదు, దుప్పటి దక్కలేదు. యుద్ధం కూడా అంతే. అది సంపదను, ప్రాణాలను చింపేస్తుంది తప్ప ఎవరికీ మేలు చేయదు.”
గజపతి మాటలతో రాజురిద్దరు ఆలోచనలో పడ్డారు. అప్పుడు గజపతి సంధి వల్ల కలిగే ముఖ్య విషయాలను వివరించింది:
యుద్ధంలో చనిపోయే వేలాది మంది సైనికులు ఎవరికో కొడుకులు, తండ్రులు. సంధి వల్ల ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఉంటాయి.
యుద్ధానికి అయ్యే ఖర్చును ప్రజల సంక్షేమం కోసం, రాజ్యాన్ని పచ్చగా ఉంచడం కోసం వాడవచ్చు.
యుద్ధం గెలిచినా, ఓడిన వాడి మనసులో పగ మిగిలే ఉంటుంది. అది భవిష్యత్తులో మరో యుద్ధానికి దారితీస్తుంది. కానీ సంధి స్నేహాన్ని పెంచుతుంది.
ముసలి ఏనుగు మాటల్లోని నిజాన్ని గ్రహించిన సింహం, పులి తమ పంతాలను పక్కన పెట్టి ‘సంధి’ చేసుకున్నాయి. నది మధ్యలో ఒక ఆనకట్ట కట్టి నీటిని ఇరువైపులా సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆ రోజు నుండి అడవిలో రక్తపాతం ఆగిపోయింది, సుభిక్షం నెలకొంది.
వినాశనాన్ని కోరే యుద్ధం కంటే, వికాసాన్ని ఇచ్చే సంధి వేయి రెట్లు మిన్న. భారతంలో శ్రీకృష్ణుడు పాండవుల తరపున కౌరవుల వద్దకు ‘రాయబారి’గా వెళ్లటంలో అంతరార్థం—లోక కళ్యాణం కోసం సంధి ఎంత అవసరమో చెప్పడం!
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
3.సన్నిహితం(శీర్షిక)

భ్రమల్లో బ్రతకొద్దు
మనం సాధారణంగా భవిష్యత్తు గురించి అందంగా ఊహించుకుని అలా జరుగుతుందని ఆశ పడుతూ భ్రమల్లో బ్రతికేస్తూ ఉంటాం. కనీసం ఆ దిశగా ఏ కృషి చెయ్యకుండానే అలా అద్భుతంగా ఊహించుకుంటూ ఉంటాం.
నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు మాకు ఫ్లూట్ వాయించడం నేర్పడానికి ఒక గురువు వచ్చేవారు. చక్కగా టక్ చేసుకున్న డ్రెస్ నల్లటి కళ్ళద్దాలు బట్టతలతో నీట్ గా ఉండేవారు. మాకు ఫ్లూట్ నేర్పిస్తూ ‘ త్వరలో నేను హైదరాబాద్ వెళ్ళి టీవీ సీరియల్స్ కు సినిమాలకు సంగీతం సమకూరుస్తా ‘ అని చెబుతూ ఉండేవారు. క్లాస్ అయ్యాక వెళ్తూ ‘ ఒక వంద రూపాయలు ఇవ్వండి బాబులు ‘ అని అడిగేవారు. ఆ వంద రూపాయలు అతని ఎంటర్టైన్మెంట్ కోసం అని మాకు తెలుసు. క్లాసులు పూర్తయిన తర్వాత ఆయన రావడం మానేశారు. కానీ తర్వాత అతని పేరు మాకు ఎక్కడా వినపడలేదు.
అలాగే..అప్పట్లో నేను కూడా చదువు అయిపోయాక హైదరాబాద్ వెళ్ళి సినిమాల్లో గాయకుడిగా , రచయితగా స్థిర పడాలి అని కలలు కనే వాడిని. హైదరాబాద్ అయితే వచ్చాను కానీ ఆ దిశగా గట్టి కృషి చెయ్యలేకపోయాను. ఉద్యోగి గా మిగిలిపోయాను .
ఆఫీసులో నా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి , ‘ సార్ .. నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వ్రాసి కలెక్టర్ అవుతాను ‘ అని చెప్పేది. కానీ ఎప్పుడూ ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు కనబడలేదు. కొన్నాళ్ళకి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.
ఇలా ..మనందరం భవిష్యత్తు గురించి ఏవేవో కలలు కంటూ ఉంటాము.కానీ ఆ కలలు నెరవేరే దిశగా ఏ కృషి చెయ్యం. జీవితం సృష్టించే గాలి వాటున అలా సాగిపోతూ ఉంటాం.అసంతృప్తికి లోనవుతాం. అందుకే భవిష్యత్తు పట్ల కలలు కనడం తప్పులేదు.కానీ కృషి చెయ్యకుండా భ్రమల్లో బ్రతకడం మాత్రం తప్పు అని నా అభిప్రాయం. అంతే కదా ఫ్రెండ్స్ !!!!
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-
4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

తెలుగు నాటక రంగ దినోత్సవం
నాటకం సమాహార కళ. కళాకారులు మానవ హృదయ నిర్మాతలు. కళాకారులు సృజనాత్మక చైతన్యానికి ప్రతిరూపాలు!
ఏప్రిల్ 16వ తారీఖున తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము! ఆరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి! బళ్ళారి రాఘవ గారి వర్ధంతి! వ్యవహార ధర్మ బోధినితో మొదటి తెలుగు నాటకం కందుకూరి గారు వేశారు! తెలుగు నాటక రంగ పితామహుడిగా ధర్మవరం రామకృష్ణాచార్యులు గారిని కూడా చెబుతారు! వావిలాల వాసుదేవ శాస్త్రిగారు, కోరాడ రామచంద్ర శాస్త్రిగారు, గద్దర్, వంగపండు…., ఎందరో జానపద కళాకారులు అందరినీ స్మరించుకుందాం! ఏప్రిల్ పదహారవ తారీఖున ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ పుట్టిన రోజు కూడా! మనం జయంతి అంటాము!
ప్రజల జీవితాల్లో నాటకం ఎందుకు? ఏం లాభాలు?! ఇంటర్నెట్ లో ఎన్నో పరిశోధక వ్యాసాలు ఎందరో రాశారు కుదిరితే చదవండి! ముందుగా విద్యార్థులు, తరగతి గది కోణం నుంచి మొదలు పెడదాం, తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా!
విద్యార్థులు థియేటర్ క్లాస్ కి వెళ్తే ఎంతో మానసిక వికాసం, ఉల్లాసం, వారు కార్య సాధకులు అవుతారు!
థియేటర్ క్లాస్ లో విద్యార్థులు ఆటోమేటిక్ గా నటనతో పాటు నాట్యం, సంగీతం, ఆర్ట్, శిల్పం, పెయింటింగ్, క్రాఫ్ట్…ఇంకా ఎన్నో by default గా నేర్చుకుంటారు Theatre class లో! Elememts of Drama, Acting tools..! Set design అనేది కూడా నాటకంలో భాగం!
భరతముని నాట్య శాస్త్రం, Constantine Stanislavski …, రియల్ థియేటర్ ఎడ్యుకేటర్ అన్నీ కలిపి చెబుతాడు!

ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ లో చాలా చోట్ల నాటకం ఒక సబ్జెక్ట్ గా బోధిస్తున్నారు! వారానికి ఒక పీరియడ్! అసలు నిజానికి ప్రతీరోజు ఒక నాటకం తరగతి ఉండాలి! అది ఏ కరికులం (Curriculum) అయినా కూడా Theatre/Drama classes must గా ఉండాలి!
Management అజ్ఞానంలో ఉంటే Senior school లో Theatre ఎందుకు అని వింత వాదన చేస్తారు!
Cambridge (CAIE) and IB(International bacculaurate, PYP, MYP & DP), లేదా CBSE లేదా State board syllabus పిల్లలు ఏ Curriculums లో చదువుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, వారికి నాటకం ఒక సబ్జెక్ట్ గా బోధిస్తున్నారా? లేదా అనేది చాలా ముఖ్యం!
దేశంలో మొత్తం తల్లితండ్రులు Theatre అనేది ఒక Subject గా ఉండాలి అని ఆలోచించాలి! నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి మన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, తల్లితండ్రులు, ప్రభుత్వాలు నిర్బంధ లేదా Compulsory నాటక తరగతులు గురించి డిమాండ్. చేయాలి!
అందులో నిష్ణాతులు అయిన టీచర్స్ ని పెట్టాలి! Performing Arts లో Post graduation, M.A.Theatre Masters Degree లేదా M.P.A.Theatre course ప్రాధమిక అర్హత గా ఉండాలి! కేవలం కోర్సు చేస్తే సరిపోదు, ఆ టీచర్ కి అవగాహన, జ్ఞానం ఉండాలి! టీచర్ కి ఉండాల్సిన లక్షణాలు ఉండాలి! నాటకం బోధించాలి అనే తపన ఉండాలి! ముందు తాను ఒక నిరంతర విద్యార్థిగా ఉండాలి! స్కూల్స్ లో ఎలాగు Interview and demo class లు చూసి Theatre educator గా ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు!
అలాగే అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో Theatre/Drama ని పిల్లల వికాసం ఒక Compulsory Subject గా పెట్టాలి రెండు రాష్ట్రాల్లో! 68 సంవత్సరాల వయసు వరకు ఉన్న Theatre చదువుకున్న Drama teachers ను ఆ స్కూల్స్ లో తీసుకోవాలి!
ఇప్పుడు అయితే In all Corporate Private schools 99% Theatre/Drama educators North India వాళ్ళు ఉన్నారు! తెలుగు నేలపై పరాయి భాషా బోధకులు! బాధాకరమే! మన వాళ్ళకి ఉపాధి దొరకాలి! ఇక్కడ వనరులతో, తెలుగు ప్రభుత్వాల సహకారంతో ఒక బిజినెస్ గా మీరు ఇక్కడ స్కూల్స్ నడుపుతున్నారు! కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు! మన తెలుగు నేలపై పుట్టిన, చదివిన టీచర్స్ కి ముందు ఉపాధి ఇవ్వండి! Pedagogical Leadership లో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండాలి!
ఏదో షో రన్ అవడం కోసం, North వాళ్ళు చూపించే Build ups, అబద్ధాలు నమ్మి మన తెలుగు వాళ్ళని తొక్కి పడేస్తున్నారు! రాజకీయంగా ఎలాగు మన దక్షిణ భారతదేశం వెనుక బడింది! మన వాళ్ళు ఎంతమంది ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులు పొందారో మనకు తెలుసు!
ఇక్కడ మన హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ, కోయంబత్తూరు…అన్ని చోట్ల ఉద్యోగాల్లో 80 శాతం ఉత్తర భారతీయులు వచ్చి చేస్తున్నారు. ఇక్కడే పాతుకుపోతున్నారు! ఇది మారాలి! దీని కోసం ధర్మ పోరాటం, ఉద్యమం జరగాలి!
ఊటీలో ఉన్న గుడ్ షెపర్డ్ స్కూల్, Lawrence Lovedale అలాగే మన హైదరాబాద్ లో ఉన్న అన్ని Corporate schools లో 95% ఉత్తర భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు! ఇంకా Software, Pharmaceutical industries, Other corporate sectors…. అన్ని చోట్ల ఉత్తర భారతీయులతో నిండి పోయి ఉన్నాయి! లోకల్ ప్రతిభను అసలు పట్టించుకోవడం లేదు! పొరుగింటి పుల్లకూర రుచి సూత్రం పాటిస్తున్నారు! పొరుగింటి పాలకూర నిజంగా రుచిగా ఉంటే ఒక పర్సంటేజ్ కి నిబంధన విధించాలి! కనీసం 70 శాతం ఉద్యోగాలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఇవ్వాలి! 30 శాతం బయట వాళ్ళకు ఇవ్వవచ్చు!
Pedagogical Leadership, Principals, all Coordinators, బయట ప్రైవేట్ కంపెనీలలో Managers, Team leads అంతా North వాళ్ళు ఉంటున్నారు! ఏదైనా Position ఖాళీ అయితే…., వెంటనే West Bengal రాష్ట్రంలో తెలిసి పోతుంది Job vacancy గురించి! (ఇక్కడ మన వాళ్ళకు తెలీదు) వారంలో ఆ ఉద్యోగం బెంగాల్ ఆమెతో నిండి పోతోంది!
మన తెలుగు వాళ్ళంటే చిన్న చూపు! లోకువ! ఎందుకు? ఏమిటి ఈ అన్యాయం?!
మన తెలుగు వాళ్ళు చిన్న తప్పు చేసినా దానిని భూతద్దంలో చూపించి ఉద్యోగం లోంచి తీసేస్తున్నారు! North వాళ్ళు పెద్ద తప్పు చేసినా వాళ్ళల్లో వాళ్ళు సర్ది చెప్పుకుని, క్షమించి North వాళ్ళ ఉద్యోగం కాపాడుకుంటున్నారు! ఉత్తర భారతీయులు ఎంతో ఐక్యత ఐకమత్యంతో (Unity) ఉంటున్నారు!
వాళ్లలో వాళ్ళకి Secret WhatsApp groups, Secret Principals group Maintain చేస్తున్నారు! కేవలం కళ్ళతో, సైగలతో మాట్లాడుకుంటున్నారు! రహస్య Signals ఇచ్చుకున్నారు!
ఆ ఐక్యత మన తెలుగు వాళ్ళకు లేదు! మనలో మనం వెన్నుపోట్లు పొడుచుకుంటాము! తప్పులు అందరూ చేస్తారు! కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి! అది మన దక్షిణ భారత ఉద్యోగులకు దొరకడం లేదు! తమిళ, కన్నడ, మలయాళం అన్ని రాష్ట్రాల నిరుద్యోలు ఇదే బాధ వ్యక్తం చేస్తున్నారు! ఉత్తర భారతీయుల దోపిడీ, అహంకారం, మన తెలుగు వారిని చిన్న చూపు చూడడం, మన తెలుగు ఉద్యోగులు ఎందరో ఒక చిన్న తప్పు చేసినా జాబ్ కోల్పోతున్నారు! ఎందుకంటే అక్కడ పై పొజిషన్ లో నిర్ణయాధికారం చేసే వాడు ఉత్తర భారతీయులు! చేతికి మట్టి అంటకుండా ఒక్కోసారి స్లీపింగ్ సెల్స్ తో మన వాళ్ళని చెడ్డ నిరూపించి, Complaints ఇప్పించి, “Give a dog bad name and kill him” అనే Policy తో ఎందరో తెలుగు వారిని చంపేస్తున్నారు! ఉద్యోగాల్లోంచి తీయించి వేస్తున్నారు ఈ North lobby!
ఈ దోపిడీ, ఈ అన్యాయం ఇంకా ఎన్నాళ్ళు? ఇది ఒక రకంగా Genocide క్రిందే లెక్క! అంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం!
తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా కళ్ళు తెరవాలి! ఈ అన్యాయం, ఘోరం, ఈ North పైశాచిక పెత్తనానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించాలి! ఉత్తర భారతీయులు సుదీర్ఘ వ్యూహాలతో మన తెలుగు వాళ్ళని తొక్కుతున్నారు! పోరాడండి, పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంకెళ్ళు తప్ప!
ఇక్కడ మన తెలుగు కంపెనీలు ఈ నిజం గ్రహించాలి! మన తెలుగు వారి పట్ల దయతో, కృతజ్ఞతతో వ్యవహరించాలి! Corporate schools యాజమాన్యాలు కూడా ఈ నిజం గ్రహించి, మీకు ఏదైనా ఒక తెలుగు ఉద్యోగి మీద ఒక ఉత్తర భారత దేశ అధికారిని Complaint చేస్తే, లేదా తన Sleeping cell అంటే వేరే వాళ్ళతో ఫిర్యాదు ఇప్పించి Divide & Rule policy లేదా Give a Dog bad name and kill him టెక్నిక్ చావు తెలివి తేటలు చూపిస్తూ…., North వాళ్ళు తమ చేతికి మట్టి అంటకుండా మన తెలుగు ఉద్యోగులను చంపుతున్నారు! మన కడుపులు మీద కొడుతున్నారు! దయచేసి మన తెలుగు యాజమాన్యాలు North వాళ్ళ (బెంగాల్ Domination మరీ ఎక్కువ ఉంది) ఈ అంతర్గత రాజకీయం అర్థం చేసుకుని మన తెలుగు ఉద్యోగులను, టీచర్స్ ను రక్షించండి! ఈ నైతిక బాధ్యత దైవ కార్యం!
ఎక్కువ ఉత్తర భారత దేశ స్త్రీలు మన హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు, పై పొజిషన్ లలో ఉన్నారు! నిర్దాక్షిణ్యంగా మన తెలుగు టీచర్స్ పట్ల, మన తెలుగు ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నారు! ఐక్యతతో నిరసన ప్రదర్శనలు జరగాలి!
అలాగే Hyderabad Central University లో కూడా నాటకం డిపార్ట్మెంట్ ముందు తెలుగు విద్యార్థులకు ఎక్కువ సీట్లు కేటాయించండి!
బెంగాల్ ఒక్కటే Light house of India కాదు! మొత్తం మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు Light houses of India! 1857 లో కలకత్తా, బొంబాయి, మద్రాసులో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం Universities పెట్టాయి! East India Company మొదట బెంగాల్ వచ్చింది! అందుకు అక్కడ ఆంగ్ల విద్య,చదువు, అక్షరాస్యత ఎక్కువ జరిగింది! అలాగే కొందరు గొప్పవారు పుట్టారు!
మన గురజాడ, కందురూరి, శ్రీశ్రీ, పోతన, శ్రీనాధుడు, ఆదిశంకరులు, …, ఎందరో గొప్ప వారు ఉన్నా మనం సరిగ్గా Promote చేసుకోలేదు! Tagore గీతాంజలి కన్నా వాడేవీడు అనే Detective Novel గొప్పది అని శ్రీశ్రీ చెప్పిన మాట వేద వాక్కు! ఈ వాక్యంలో గొప్ప యుద్ధాన్ని దాచాడు శ్రీశ్రీ! సైనికుల కోస యుద్ధం ఎదురు చూస్తోంది! ఇది ధర్మ పోరాటం!
మహాకవి పోతన భాగవతంలో రెండు పద్యాల విలువ చేయదు గీతాంజలి! కానీ మనవారి ప్రతిభ ప్రపంచ ప్రఖ్యాతం చేసుకోలేకపోయాము! మనలో మనం కొట్టుకున్నాము!
ఒక పుస్తకాన్ని ఇంకో పుస్తకంతో పోల్చకూడదు, కానీ మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మన తెలుగు వారిని బానిసలుగా చూసినప్పుడు పోల్చి తీరుతాం! మన అల్లూరి సీతారామరాజు, మన కన్నెగంటి హనుమంతు, మన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, మన కొమురం భీం మనకు ఉన్నారు! మన గొప్ప సాహిత్యం మనకు ఉంది!
ఇక సన్నాయి నొక్కులు వద్దు! దక్షిణ భారతీయులు విప్లవోద్యమాన్ని వెలిగించాలి! లేకపోతే దక్షిణ భారతం బ్రతకదు! రాజకీయ, సాంస్కృతిక, ఆత్మ గౌరవ, ఆర్థిక, హక్కుల ఉద్యమం దక్షిణ భారతీయులు చెయ్యాలి!
ఇప్పటికే జరిగిన నష్టం కొన్ని లక్షల కోట్లు! నైతికంగా జరిగిన నష్టం లెక్కకు అందదు! ఇప్పుడు రాజకీయంగా నియోజక వర్గాల విభజన…, అనే అన్యాయం…, జనాభా ప్రాతిపదికన జరిగితే ఇక దక్షిణ భారతం బ్రతకదు!
కళ్ళు తెరిచి తెలుగు ప్రజలు పోరాట మార్గం ఎన్నుకోవాలి! దేశం అంతా ఒకటే నిజం! మేరా భారత్ మహాన్! కానీ ఉద్యోగాల్లో లోకల్ పర్సంటేజ్ పెట్టీ తీరాలి! జరుగుతున్న ఈ Secret Humiliation గుర్తించి, అలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలి!
ప్రజలలో అంతర్యుద్ధం రాకముందే, జరుగుతున్న ఘోరమైన తప్పులు, అన్యాయం, మన తెలుగు వాళ్ళు పడుతున్న మానసిక హింస అన్నీ గుర్తించి సరి చేయాలి! దయతో అర్ధం చేసుకోండి!
ఉత్తర భారతీయులు మన సోదరులే! అదే భావం వారికి కూడా ఉండాలి! మన నేల మీద ఉద్యోగం చేస్తూ, మన తిండి, మన అన్నం తింటూ…, మనల్ని బానిసలుగా చూస్తాం అంటే కుదరదు! ఈ దోపిడీ నశించాలి! మన బ్రతుకు తెరువు మీద, మన పొట్ట మీద కొట్టినా ఎలా సహిస్తాం?!
తెలుగు విద్యార్ధులు కళ్ళు తెరవండి! యూనివర్సిటీలలో చర్చ చేయండి! సెమినార్లు పెట్టండి! కార్యాచరణ ప్రకటించండి! పెద్దలు సహకరించండి! కొన్ని బందులు చేయాలి! బదులు చెప్పాలి! మన నిరసన చాలా Concrete గా వ్యక్తం చేయాలి! మాటలు కన్నా చేతలు పదునైననవి!
నాటకాంతః సాహిత్యం అన్నారు! కావ్యేషు నాటకం రమ్యం అని కూడా! నేను సాహిత్యాంత: నాటకం అని నమ్ముతాను! ముందు సాహిత్యం సరిగా వస్తే, అర్థం అయితే, సాహిత్యం బాగా చదివితే గొప్ప నాటకాలు వేయగలుగుతాము! లేదంటే మన తెలుగు పరిషత్ నాటకాల్లో ఎక్కువ చోట్ల కన్పించే అజ్ఞానం అలాగే ఉంటుంది! పరిషత్ లలో అద్భుత నాటకాలు కూడా పడ్డాయి! వ్యయ ప్రయాసల కోర్చి కొన్ని పరిషత్తులు నిస్వార్థంగా నడుస్తున్నాయి!
గొప్ప సాహిత్యం చదివితే గొప్ప రచనలు చేయగలుగుతారు! అద్భుతం చేయాలి అంటే ముందు అద్భుతం చూడాలి, చదవాలి!
తెలుగు కవిత్వం, తెలుగు కథ, తెలుగు నవల, తెలుగు వ్యాసాలు…, కథానికలు ప్రపంచ సాహిత్యాన్ని దాటి ప్రవహించాయి!!
తెలుగు పద్య నాటకం కొంతవరకు ఆ స్థాయి అందుకుంది! తెలుగు సాంఘిక నాటకం కూడా ఆ స్థాయికి ఎదగాలి! కొన్ని మెరుపులు ఉన్నాయి! ఇప్పటికీ గురజాడ కన్యాశుల్కం, కాళ్ళకూరి గారి వరవిక్రయం, చింతామణి… ఇవే గొప్ప నాటకాలు అనుకుంటూ ఉంటే ఎలా?
ఈ సంవత్సరం తెలుగు నాటక రంగ దినోత్సవం రోజు…., ఎక్కువ చర్చ నేను ఉపాధి అవకాశాలు, మన తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాలు ఎక్కువ ప్రస్తావన చేశా!
తెలుగు డ్రామా అనే వాట్సప్ గ్రూప్, హైదరాబాద్ లో రంగభూమిలో తెలుగు నాటక రంగ దినోత్సవం April 16 న చేస్తాను అంటోంది! రామకోటేశ్వరరావు గారు ఎవరికి తోచిన డొనేషన్ వాళ్ళు ఇవ్వండి అని గ్రూప్ లో పెట్టారు! ఆయన శ్రమ, నాటకంపై రామకోటేశ్వర రావు గారి ప్రేమను అభినందించాలి! రసరంజని సంస్థ ద్వారా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు!
మంచి రోజు ఒక వేదిక పెట్టుకుని, సరైన అంశాలు సరైన దిశలో చర్చ చేస్తే మంచిదే! తర్వాత కార్యాచరణ కూడా ఉండాలి! తెలుగు నాటకం కోసం రసరంజని అనే సంస్థ కూడా ఎన్నో గొప్ప పనులు చేసింది!
శ్రీ రమణాచారి గారి వల్ల నంది నాటకాలు, తెలుగు నాటక రంగ దినోత్సవం…, ఆయనే ఎన్నో మంచి పనులకు కారణం! అలాగే శ్రీ నందివెలుగు ముక్తేశ్వర రావుగారు కూడా నాటక రంగం కోసం ఎంతో చేస్తున్నారు!
ఇక ముందు కూడా ఎన్నో చేయాలి అని ప్రణాళికలు నాతో చెప్పారు! చూద్దాం!
యూనివర్సిటీలలో శ్రీ కోట్ల హనుమంత రావుగారు లాంటి కొందరు ఆచార్యులు ఎందరో నాటక విద్యార్థులను తయారు చేస్తున్నారు! హనుమంతరావు గారు ఎందరినో ప్రోత్సహిస్తున్నారు!
దీక్షిత్ మాస్టారు ఆయన ఉండగా ఎందరో శిష్యులను తయారు చేశారు! ఎందరికో అన్నం పెట్టారు! మిశ్రో గారు ఈ వయసులో కూడా నాటకాలు వేస్తూ ఎందరికో స్పూర్తి నింపుతున్నారు! KKL స్వామి చదువుకున్నది తక్కువ, ఒక కార్మికుడిగా జీవితం మొదలు పెట్టీ నాటకం కోసం జీవిస్తున్నాడు.
TJ రామనాధం గారు మొత్తం జీవితం నాటకం కోసం ఇచ్చారు! రామనాధం గారు వందల ప్రదర్శనలు ఇచ్చారు!
ప్రసాద మూర్తిగారు, పెద్ది రామారావు గారు, కొల్లా రాధాకృష్ణ గారు, నాటకం కోసం ఎన్నో వ్యాసాలు రాసే బి.వి.అప్పారావు గారు…, నాటక బోధన, నాటక విశ్లేషణ, యోగా అభ్యాసం, ఆధ్యాత్మిక ధర్మ ప్రయాణం వీటినే ఊపిరిగా చేసుకుని అడుగులు వేస్తున్న శ్రీనివాసరాజు పెన్మెత్స (ఈ వ్యాస కర్త, కలియుగంలో చెప్పుకోక తప్పదు), దాదాపు అదే రకమైన లక్ష్యం పెట్టుకుని, తన సొంత పంథాలో Dr.CVL శ్రీనివాస్ ఒరిస్సాలో ఉత్కళ యూనివర్సిటీలో తన ఉద్యోగం వదులుకుని ప్రయత్నాలు మొదలు పెట్టారు!
నేను ఇంకో పద్ధతిని బాగా ఇష్టపడతాను!
ఊరూరా సైకిలు పై తిరుగుతూ నాటకం, లేదా పాదయాత్ర చేస్తూ…., నాటక విద్య బోధిస్తూ, దానిని వ్యక్తిత్వ వికాస, మానసిక వికాస, యోగా, మెడిటేషన్ అన్నీ కలుపుతూ, చిన్న పిల్లలు, విద్యార్థులను, ప్రజలను చైతన్యం చేస్తూ, వారికి నేర్పుతూ, మనం నేర్చుకుంటూ…., భారత సమాజం, మన తెలుగు సమాజంలో ఒక భాగం అవడం…., ఈ దారిలో నడవాలి, ఆ యోగం వైపు ఋష్యత్వం వైపు మనలో కొందరి సంకల్పాలు అయినా సాగాలి! దానికి ఎంతో త్యాగం, నిరాడంబరత, వినమ్రత, సరైన వైరాగ్య భావం, ప్రేమ ఉండాలి! గొప్ప పనులు చేయాలంటే ఎన్నో వదులుకోవాలి!
మరి కొందరు తెలుగు నాటక ప్రముఖులు పేరులు చూద్దాం!
గోవాడ వెంకట్, భాషా, IAS బలరామయ్య గారు, బలరామమూర్తి గారు, బషీర్, Anchor ఝాన్సీ (ఎంతో గొప్ప కళాకారిణి, గొప్ప వ్యక్తి), ప్రొఫెసర్ పద్మప్రియగారు, మేకప్ మల్లాది గోపాల కృష్ణ గారు…., PVN కృష్ణ గారు, గుమ్మడి గోపాల కృష్ణ గారు, శ్రీ డి.విజయ భాస్కర్ గారు…., మీగడ రామలింగ స్వామి గారు, శ్రీ DSN మూర్తి గారు, కురువృద్ధులు అయిన ఈరోజుకీ అద్భుతాలు చేస్తున్న శ్రీ BM రెడ్డిగారు….,
భాస్కర్ చంద్ర గారు, పాటిబండ్ల గారు, కందిమళ్ళ సాంబశివరావు గారు, శ్రీ శాంతారావు గారు, సామాజిక కార్యకర్త, థియేటర్ యాక్టివిస్ట్ దేవిగారు,
గంగోత్రి సాయి, MS చౌదరి ఆయన శిష్యులు…ఎందరో! ఆచార్యులు రాజీవ్ వేల్చేటి, ఆచార్యులు భూషణం గారు, కళల కాణాచి పరిషత్ ను తన సొంత డబ్బులతో నడుపుతున్న బుర్రా సాయి మాధవ్…, ఇంకా ఎందరో పరిషత్ నిర్వాహకులు, నటి సురభి ప్రభావతి, జయ సునయన, ఎన్.తారక రామారావు గారు, గోపరాజు విజయ్, వారి తండ్రి రమణ గారు, నాయుడు గోపి, తనికెళ్ళ భరణి, తల్లావజ్జుల సుందరం గారు, వీథి నాటకం నా జీవితాశయం అని చాటిన సినిమా మాటల రచయిత, దర్శకుడు జె కె. భారవి, మన భాష కాకపోయినా తెలుగు నేలపై నాటకంలో నడుస్తున్న రామ్మోహన్ హోలగండి, ప్రసాద్ రెడ్డి గారు, ..ఇలా ఎందరో! …., స్థలా భావం వల్ల కొందరి పేరులే రాయగలిగా! నిజంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు!
ఏపిలో 16 న కొన్ని చోట్ల తెలుగు నాటక రంగ దినోత్సవం జరుపుకుంటున్నారు! సభలు, విగ్రహాలకు దండలు, పూలమాలలు, చెక్కలు, దుప్పట్లు సరేసరి! లేదా కొన్ని సన్మానాలు, మంచిదే! కానీ చర్చలు దిక్సూచి సరైన దిశలో కదలాలి!
All is well with the world అనుకుంటే కుదరదు! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న నాటక రంగ కళాకారులు ఏకం కావాలి! అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఏం మాట్లాడినా అది ఉద్యమానికి బీటలు వారతాయి అనే ఉద్దేశ్యంతో గురజాడ, కందుకూరి పక్క రాష్ట్రం అనే చర్చలు చేశారు! ఇప్పుడు చట్ట బద్ధంగా మనవి రెండు రాష్ట్రాలు! ఇప్పుడు విశాల దృక్పథంతో, ఔన్నత్యం నిండిన పెద్ద మనసుతో తెలంగాణ నాటక కళాకారులు April 16 ను తెలుగు నాటక రంగ దినోత్సవంగా కలసి జరుపుకుని, అంగీకరించి Larger canvas లో జరిగే అన్యాయాలపై కలిసి తెలుగు సమాజం పోరాడాలి! (ఏప్రిల్ 16 ను తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రపోజ్ చేసింది తెలంగాణకు చెందిన శ్రీ రమణాచారిగారు)!
దక్షిణాది రాష్ట్రాల ఐక్యత, తెలుగు ప్రజల ఐక్యత ఇప్పుడు చాలా అవసరం!
మార్వాడీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది! ఆ ఉద్యమం ఎందుకు పలుచన అయ్యిందో, ఎలా నీరుగారి పోయిందో , ఎలా అణచి వేయబడిందో కొందరికే తెలుసు! దాని వెనుక ఉన్న శక్తులు ఎవ్వరో మీకు తెలుసు!
Business doesn’t have a human face. వ్యాపారాలకు మానవీయ ముఖం ఉండదు! లాభం చూస్తారు అంతే! రాజకీయ లాభాలు, ఆర్థిక లాభాలు! పదవుల లాభాలు! దానిని బట్టి Narratives build అవుతాయి! రాజకీయ పార్టీల అనుబంధ మీడియాలు వారి ఎజెండాల ప్రకారం వేదికలు ఇస్తాయి!
లేదంటే, ధర్మం అధర్మం అంటారు! న్యాయం అన్యాయం అంటారు! గోబెల్స్ ప్రచారం! పది మంది కాదు కాదు అంటే అదే నిజంలా ఈరోజుకీ చలామణీ అవుతోంది! ఆశ్చర్యం కదా! కలియుగం అంతా! దీనిని మీరే మార్చాలి!
ప్రయోటరైజ్డ్, రేషన్ బేస్డ్ ఉద్యమాలు మనవి! సంకుచితం మనసుల్లో ఆత్మలో! గొప్ప సాహిత్యమే పరిమళాలు వెదజల్లాలి!
IAS circle లో ఉన్నవాళ్ళకి కూడా తెలుసు, తాము ఉత్తర భారతీయ అధికారుల చేతుల్లో ఎన్నిసార్లు Humiliation కు గురి అయ్యారో!!!
Who bells the Cat? ఇప్పుడు కుక్క మెడలో(పిల్లి మెడ్గంలో) గంట ఎవరు కట్టాలి!? ఆ ధైర్యం ఎవరికి ఉంది ? దక్షిణ భారతం ఎంతో నష్టపోతోంది! గొంతు విప్పండి! ప్రజా కళాకారులారా గళం విప్పండి! ఈ విషయం మాట్లాడితేనే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు! ప్రత్యేక హోదా, రాజకీయ పలుకుబడి, విశాఖ ఉక్కు, అన్ని నిర్ణయాలు ఉత్తర భారతీయులు నిర్ణయిస్తే…, ఇక మన దక్షిణాది నాయకులు ఎందుకు? ప్రజలు ఇంకెప్పుడు చైతన్యం తెచ్చుకుంటారు!!
తెలుగు నాటక రంగ కళాకారులు లారా ఏకం కండి! రాజకీయ నాయకులులా ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవొద్దు! నష్టపోయింది చాలు!
అదే సినిమా రంగం అయితే…, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్…, తెలుగు సినిమా, తమిళ సిన్మా, హిందీ సినిమా…, ఇలా అనవద్దు, మనది ఇండియన్ సినిమా అందాం అని వేదికల మీద చెప్పే ఉపన్యాసాల సోదిలో డొల్లని గ్రహించండి! అవి భారీ ఎత్తున జరిగే వ్యాపారం కోసం మాట్లాడే దొంగ మాటలు! తెలుగు సినిమాలలో కూడా 60% పైగా ఉత్తర భారత నటులకు అవకాశం ఇస్తున్నారు! మన తెలుగు నటులు అంటే చిన్నచూపు! తెలుగు మాట్లాడక పోతే వారు గొప్ప నటులు! ప్రత్యేక సందర్భంలో ఇక తప్పదు అంటే వేరు! తెలుగు నటులకు, తెలుగు నటీమణులకు తెలుగు సినిమాల్లో అవకాశం ఇవ్వడం మీ సామాజిక బాధ్యత! లేదంటే అది మహాపాపం! తెలుగు సినిమాల్లో కూడా పర భాషా నటులుదే పెత్తనం అంటే ఎలా? ఇది సాంకేతిక నిపుణులకు కూడా వర్తిస్తుంది!
Theatre Fraternity చాలా చిన్నది! ఇక్కడ సూది మొన అంత వ్యాపారం చేయడం కూడా కష్టం! నాటకాన్ని, కళలను ఒక సామాజిక బాధ్యతగా అనుకుని మనం ప్రయాణం చేస్తున్నాం! అందులో బ్రతుకు తెరువు కూడా దొరికితే సంతోషం! నిజమైన కళాకారులను సమాజం కాపాడుకుంటుంది! పోషిస్తుంది! మన తెలుగు జాతి గొప్పది!
తెలుగు నాటక రంగ దినోత్సవం రోజు, ఉద్యమం కాగడా వెలగాలి! తెలుగు కళాకారుల ఐక్యత చాటాలి! కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం! ప్రపంచ యుద్ధాలను ఆపే వైపు, శాంతి వైపు నాటకం నడవాలి! అలాగే అన్యాయం జరిగినప్పుడు దానిని సరి చేసే యుద్ధ నౌక కూడా నాటకం, నిజమైన కళ కారణం కావాలి!
తెలుగు నాటక రంగ దినోత్సవం ఎందుకు జరపాలి అంటే, (World Theatre day March 27th ఉందిగా అని ఎవరైనా అంటే), సాంస్కృతిక పరిరక్షణ, సామాజిక అవగాహన చైతన్యం, సృజనాత్మక అభివృద్ధి, తెలుగు భాషా అభివృద్ధి,….
కళాకారులకు గౌరవం, సామాజిక సందేశాల వ్యాప్తి, యువతలో విద్యార్థులలో నాటక రంగం పట్ల ఆసక్తిని పెంచడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఒక Cultural Policy ఉండాలి అని డిమాండ్ చేయడం, ప్రతీ గవర్నమెంట్ స్కూల్ లో నాటకం సబ్జెక్ట్ ని Compulsory చేయడం…., సమాజంలో మంచి విలువలను నాటకాలు ద్వారా పరివ్యాప్తి చేయడం…, వీటి అన్నిటి గురించి ఒక చర్చ, Action plan, ప్రణాళిక, కార్యాచరణ రూపకల్పన, గత సంవత్సరం అనుకున్న Action plan review…., ఈ గొప్ప లక్ష్యాల కోసం తెలుగు నాటక రంగ దినోత్సవం జరుపుకోవాలి! అందరూ భాగం కావాలి! ప్రభుత్వ హోదాల్లో ఉన్నవారు, పలుకుబడి ఉన్నవారు అందరినీ భాగస్వామ్యం చెయ్యండి!
అందరికీ తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు!
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-
5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమలేశుని ఆదాయాన్నీ వదలని బ్రిటిష్ పాలకులు
వ్యాపారులుగా వచ్చి పాలకులుగా మరి భారత దేశాన్ని వందల ఏళ్లపాటు ఏలిన బ్రిటిష్ పాలకులు తిరుమలేశుని ఆదాయాన్ని కూడా వదలలేదు. శాసనాధారాల ప్రకారం మద్రాసు కేంద్రంగా పనిచేసిన బ్రిటిష్ పాలకుడు రాబర్ట్ క్లైవు 1750 లో తొలుత తిరుమల ఆదాయం పై దృష్టి సారించాడు. క్లైవు ఆదేశాలతో 1751 నుంచి తిరుమల ప్రాంత పాలకుడైన ఆర్కాటు నవాబు తిరుమల ఆలయ ఆదాయమును లెక్కకట్టి ఇంగ్లీషు పాలకులకు పంపించడం మొదలు పెట్టాడు. ఆలయం నుంచి, దేవాలయ భూముల నుంచి లభించే ఆదాయాలు పూర్తిగా తమకు రావడం లేదనే కారణంతో 1752 నుంచి బ్రిటిష్ వారి ప్రతినిధులే వసూళ్లు చేసుకోవడం మొదలు పెట్టారు. తిరుమల ఆలయ ఆదాయంతో పాటు బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివర ఆస్థానం సందర్భంగా ఎక్కువగా వచ్చే భక్తులనుంచి కూడా వసూలు చేసుకోవడం మొదలు పెట్టారు.
1753 – 1758 మధ్యకాలంలో తిరుమల ఆలయ ఆదాయం నుంచి, భూముల ఆదాయాల నుంచి ఏటా రూ 2 లక్షల 50 వేలు చొప్పున వసూలు చూసుకునేవారని ఆకాలంలో దేవాలయ కౌలుదారు గా పనిచేసిన శ్రీనివాసా చార్య డైరీల ద్వారా వెల్లడైంది. 1754 లో తిరుపతి పరగణాను ఆర్కాటు నవాబు సమస్త హక్కులతో బ్రిటిష్ వారికి అప్పగించడంతో 1800 సంవత్సరం వరకు బ్రిటిష్ వారు తమ ప్రతినిధుల ద్వారా తిరుమల ఆలయ ఆదాయాన్ని వసూలు చేసుకునేవారని తెలుస్తోంది.
1801 లో ఈస్టిండియా కంపెనీ వారు తిరుమల దేవాలయ పరిపాలనను పూర్తిగా కైవశం చేసుకుని స్వామి ఆదాయాన్ని క్రమపద్ధతిలో వసూలు చేసుకున్నట్టు తెలుస్తోంది. 1821 లో ఏర్పాటు చేసిన బ్రూస్ కోడ్, పారుపత్య అమలునామా ల ద్వారా దేవాలయ విధివిధానాలను బ్రిటీష్ వారు పరోక్షంగా నిర్దేశిస్తూ వచ్చారు. ఆ సందర్భంగా దేవాలయ భూములను స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ పాలకులు తిరుమల కేంద్రంగా 19 పెద్ద దేవాలయాలు, 18 చిన్న దేవాలయాలనే విభజన చేసి మొత్తం ఆదాయాన్ని వసూలు చేసుకుంటూ తస్ దిక్ భత్యం పేరుతో ఆలయ నిర్వహణకు కొంత ఇచ్చే విధానం అమలులోకి తెచ్చారు. హిందూ సంఘాల ఒత్తిడితో దేవాదాయ చట్ట సవరణలు వచ్చిన తరువాత 1843 లో తిరుమల క్షేత్ర పాలన మహంతుల అధీనంలో వచ్చే వరకు బ్రిటిష్ వారి దోపిడీ యధావిధిగా కొనసాగినట్టు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి.
ఓం నమో వెంకటేశాయ

