SINGER | బెదిరింపుల ఆరోపణలు..

SINGER | బెదిరింపుల ఆరోపణలు..
SINGER | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు పొందిన గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
ఫోక్ గాయని మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొందరిపై పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సుమారు 100మంది నుంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
అయితే, కాలం గడిచినా ఎటువంటి లాభాలు ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా, పెట్టుబడిగా ఇచ్చిన అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. దీంతో న్యాయం కోసం వారు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న న్యాయవాదిని మంగ్లీ, ఆమె బృందం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని, తనను ప్రమాదానికి గురిచేస్తామని బెదిరించారని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వెలుగులోకి రావడం గమనార్హం.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం మంగ్లీ, శివ, వేణు ఊడుగుల, ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వరుస హిట్ పాటలతో కెరీర్‌లో దూసుకుపోతున్న మంగ్లీపై ఈ ఆరోపణలు రావడం సినీ, సంగీత రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
