ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..

టీబీ హారేగా.. దేశ్ జీతేగా నినాదంతో మున్ముందుకు..
ఆరోగ్య మౌలిక సదుపాయాలను బ‌లోపేతం చేస్తున్నాం
టీబీ ముక్త్ భార‌త్ అభియాన్ ద్వారా ఘ‌న‌మైన ఫ‌లితాలు
ఆధునిక సాంకేతిక‌త సాయంతోనూ కార్య‌క్ర‌మాల అమ‌లు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేశంలో ఆరోగ్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయ‌ని.. వివిధ స్థాయుల్లో స‌మ‌గ్ర‌, నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డంతో పాటు వైద్య పరిశోధనలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్‌, ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ త‌దిత‌రుల‌తో క‌లిసి గొల్ల‌పూడిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సంద‌ర్శించారు.

అక్క‌డ ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాన్ని ప‌రిశీలించి.. ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న ఆరోగ్య స్పృహ‌, వ్యాధుల గుర్తింపు ప‌రీక్ష‌లు, స‌కాలంలో చికిత్స తీసుకునేలా ప్రోత్స‌హించ‌డం వంటి సేవ‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాధి నిర్ధార‌ణ‌కు అనుస‌రిస్తున్న విధానాలతో పాటు టీబీ ముక్త్ భార‌త్ అభియాన్ – 100 రోజుల ప్ర‌చార కార్య‌క్ర‌మం అమ‌లు తీరును ప‌రిశీలించారు. కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన పోర్ట‌బుల్ ఎక్స్‌రే వ్య‌వ‌స్థను ప‌రిశీలించారు. ఈ వ్య‌వ‌స్థ వ‌ల్ల ప్ర‌జ‌లు తేలిగ్గా ఎక్క‌డెక్క‌డికో వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా త‌మకు ద‌గ్గ‌ర్లోనే ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు వీల‌వుతుంది.

అనంత‌రం నిక్ష‌య్ మిత్ర చొర‌వ ద్వారా క్ష‌య రోగుల‌కు పోష‌కాహార కిట్ల‌ను అంద‌జేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను అనుసంధానం చేస్తూ దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. 2024, డిసెంబ‌ర్‌లో ప్రారంభ‌మైన రెండో విడ‌త ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించామ‌ని.. ప్రపంచవ్యాప్తంగా టీబీ తగ్గుదల రేటుతో పోలిస్తే భారత్‌లో టీబీ కేసులు, మరణాల తగ్గుదల రెట్టింపు వేగంతో కొనసాగుతున్నట్లు వివరించారు.

డేటా విశ్లేషణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో దేశవ్యాప్తంగా టీబీ ముప్పు అధికంగా ఉన్న 1,58,000 గ్రామాలు, పట్టణ వార్డులను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. టీబీ ముక్త్ భారత్ యాప్ – నిక్ష‌య్ ద్వారా రోగులు, వైద్య నిపుణులకు స‌రైన మార్గనిర్దేశం అందుతోంద‌ని చెప్పారు. ఏఐ చాట్‌బాట్ ద్వారా రోగులకు తక్షణ సహాయం అందించ‌డం జ‌రుగుతోంద‌ని.. టీబీ రోగులకు పౌష్టికాహారం, సామాజిక మద్దతు అందించడంలో నిక్షయ్ మిత్ర కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంద‌ని తెలిపారు.

టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి, పూర్తి చికిత్స తీసుకోవ‌డం ద్వారా పౌష్టికాహారం, మాన‌సిక స్థైర్యంతో టీబీపై విజ‌యం సాధించవ‌చ్చ‌ని పుణ్య సలిలా శ్రీవాస్తవ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ రోణంకి గోపాల‌కృష్ణ‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (సెంట్ర‌ల్ టీబీ డివిజ‌న్‌) ర‌ఘురామ్ రావు, అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ డా. సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌రి, జేడీ (ఎన్‌టీఈపీ) డా. ర‌మేష్‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply