రైల్వేలో డిజిటల్ విప్లవం….

రైల్వేలో డిజిటల్ విప్లవం….

రైల్ పార్సిల్ యాప్‌తో సత్వర సేవలు..
పార్సిల్ సేవల్లో స్మార్ట్..
డోర్ టు డోర్ సదుపాయం..
వినియోగదారులకు మరింత చేరువ‌గా సేవలు..
పారదర్శకత, వేగం, సౌలభ్యం లక్ష్యంగా..
ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ అమలు..
నెల రోజుల్లోనే 280 బుకింగ్స్ నమోదు..
యాప్‌కు విశేష స్పందన..
ఇండియా పోస్ట్‌తో కలిసి సేవలు..
రవాణా రంగంలో సరికొత్త మార్పులు..

విజయవాడ, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పార్సిల్ రవాణా సేవలను ఆధునికీకరించేందుకు కీలక అడుగు వేసింది. రైల్ పార్సిల్ యాప్‌ను అమల్లోకి తీసుకువచ్చి, లాజిస్టిక్స్ రంగంలో డిజిటల్ సౌకర్యాలను విస్తరించింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి. మార్చి 12న విజయవాడ, రాజమండ్రి సహా ఎస్‌సీఆర్ పరిధిలోని ప్రధాన కేంద్రాల్లో ఈ యాప్ ప్రారంభించబడింది.

డోర్-టు-డోర్ పార్సిల్ బుకింగ్, డెలివరీ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలకు సమయోచిత సేవలు అందుతున్నాయి. బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, సరుకు రవాణాలో పారదర్శకతను పెంపొందించడం ఈ యాప్ ముఖ్య లక్షణాలు. భారతీయ రైల్వేలు చేపడుతున్న డిజిటల్ పరివర్తనలో భాగంగా ఈ యాప్ అమలు చేయబడింది.

ఇండియా పోస్ట్‌తో సంయుక్తంగా అమలు చేస్తున్న జాయింట్ పార్సిల్ ప్రోడక్ట్ కార్యక్రమానికి ఇది బలాన్నిస్తుంది. ఈ సమన్వయంతో పార్సిల్ సేవలు మరింత విస్తృతంగా, సమర్థవంతంగా అందే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్, సీనియర్ డివిజనల్, కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, యాప్ ప్రారంభమైన కొద్ది కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

గత నెలలో విజయవాడ కేంద్రం నుంచి 280 పార్సిల్స్‌ బుకింగ్‌ నమోదయ్యాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ యాప్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అమలు చేస్తూ, వేగవంతమైన, నమ్మదగిన, సమర్థవంతమైన పార్సిల్ రవాణా సేవలను అందించేందుకు విజయవాడ డివిజన్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Leave a Reply