Mulugu | డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్లో ప్రమాదం..

Mulugu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ములుగు జిల్లాలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాలు ఢీకొన్నప్పటికీ ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో ఈ ఘటన జరిగింది. డీజీపీ పర్యటనకు ముందుగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో వాహనాలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక పోలీసు వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాలను రహదారి పక్కకు తరలించి పరిస్థితిని సమీక్షించారు.
డీజీపీ పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సువర్ణతో కలిసి డీజీపీ శివధర్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్రెగుట్టల్లోని పామునూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును ఆయన పరిశీలించనున్నారు.
