సమన్వయంతో సమస్యలకు పరిష్కారం
హైడ్రా – జీహెచ్ ఎంసీ కమిషనర్ల సమావేశం
కమిటీలు వేసి ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ఇరు విభాగాలు సమీక్ష.
హైదరాబాద్ – వరద ముప్పుతో పాటు.. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా – జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , కె. ఇలంబర్తి మంగళవారం జీహెచ్ ఎంసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్టుమెంట్తో పాటు.. హైడ్రా, జీహెచ్ ఎంసీ విభాగాలతో కలసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఇరువురు కమిషనర్లు నిర్ణయించారు. అలాగే వర్షాకాలంలో వరద ముప్పు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడడానికి ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ ఎంసీ అధికారులతో కమిటీలు ప్రాంతాలవారీ వేయాలన్నారు.

ఈ రెండు కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై.. సమన్వయంతో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు ఏ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా.. ఆయా ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాల్సినవసరం ఉందని భావించారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతం నుంచే తనిఖీలు ప్రారంభించి.. వారిని అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. వాటిని నివాసితులు, వాణిజ్య సముదాయాల యజమానులు పాటిస్తున్నారా.. అనేది తరచూ తనఖీలు చేయాల్సినవసరాన్ని గుర్తుచేశారు.
నగరంలో వరద ముప్పు ఉన్న 141 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు.. అక్కడ పరిస్థితి ఎలా ఉంది.. వరద నివారణకు తీసుకున్న చర్యలపై ఇరువురు కమిషనర్లు సమీక్షించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం.. కల్వర్టులు, నాలాలు, క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్యాచ్మెంట్ ప్రాంతాలను గుర్తించి.. వరద నీరు దగ్గర్లో చెరువుకు చేరేలా చూడాలని సూచించారు. జోనల్ స్థాయి కమిటీలు అక్కడి సమస్యకు సమాధానం చెప్పేలా ఉండాలని భావించారు. సమస్యపై పూర్తి అవగాహన ఉంటే.. పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడికక్కడ జవాబూదారి వ్యవస్థను రూపొందించినప్పుడే వరద ముప్పుతో పాటు.. అగ్ని ప్రమాదాలను నివారించగలమన్నారు.