28marchchintana | విశ్వనాథ కల్పవృక్షంలో రావణుడు

28marchchintana | విశ్వనాథ కల్పవృక్షంలో రావణుడు

28marchchintana | రావణుడు కాముకుడా? సాధకుడా?
సీతాదేవి శక్తి స్వరూపిణి అనే తాత్విక భావన
త్యాగం, అమృతత్వం మరియు సాధకుని మార్గం
విశాలాక్షీ సంబోధనలోని అంతరార్థం
లలితా త్రిపురసుందరిగా సీతాదేవి దర్శనం
రావణుని సర్వ సమర్పణ భావన
శాశ్వత నిర్వాణం వైపు రావణుడి ప్రయాణం

28marchchintana | రావణుడు పైకి కాముకునిగా కనిపిస్తున్నా… విశ్వనాథవారి రామా యణ కల్పవృక్షంలో అతనొక సాధకుడు. సీతాదేవి శక్తి స్వరూపిణి. “శక్తి” అనేది పరమాత్మదే. తనది కాని దానిని తనదిగా చేసుకోవాలని భావించడం అజ్ఞానం. అజ్ఞానం పోతేనే ముక్తి, రాక్షస భావనల వల్ల, అజ్ఞానం వల్ల సీతాదేవి దర్శనం వర కు తానే సర్వశక్తి సమన్వితుడనని భావించాడు. సీతాదేవి దర్శనంతో రావణునిలో జన్మరాహిత్యాన్ని పొందాలనే భావన ఉత్తేజితమై ఆమెను ఎత్తుకొచ్చాడు. సుందరకాండలో విశ్వనాథవారు రావణుని నోట పలికించిన ప్రతి మాటలోనూ పైకి కాముకత్వం కనిపిస్తున్నా.. ఆంతర్యంలో ఎప్పుడెప్పుడు అమ్మవారిలో లయం కాగలననే ఆర్తియే కనిపిస్తుంది. రావణుని మానసాన్ని తాత్వికంగా ఆవిష్కరించిన విశ్వనాథ అంటారూ..

28marchchintana

‘భ్రాజితమైన యీ సకల వైభవమున్ ద్యజియించి యొక్క నీ
తబఁ జనుదెంతు, నేరికిని దబఁపని సీమల నీవు దేవతా
భ్రాజిత మూర్తి వేను పదవారిజ సేవక్నఁడన్, భవత్కటా
క్షా జిర రంగ వల్లులకు నద్దినదౌ మృగనాభి కల్పుడన్!

భ్రాజితము… ప్రకాశవంతమైన… దేనితో ప్రకాశవంతమైనది… ప్రేయస్సుచే.. “నేను” అనే అహంకారం ప్రేరణగా.. శక్తి, సామర్థ్యాలతో ఐహికంగా తాను సాధించిన… సకల వైభవాలను… త్యజిస్తాను.. అంటున్నాడు. ఎందుకు? ఒకటి కావాలంటే ఒకటి త్యజించాలి. త్యాగేనేకే అమృతత్వ మానుకు అన్నారు. అమృతత్వాన్ని సాధించాలి అంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి, దేని కోసం దేనిని విడిచి పెట్టాలనేది సాధకుని విజ్ఞత. నిర్ణయం ఉదాత్తంగా ఉండాలి. సీత కనిపించనంత వరకు రావణుడు “నేను” అనే భ్రాంతిలో ఐహిక సంబంధిత వస్తువులపై, యశస్సుపై, భోగాలపై మమకారం పెంచుకున్నాడు. వాటి వెంట పరుగులు తీసాడు. సీతాదేవి కనిపించింది.. లక్ష్యం అవగాహనకు వచ్చింది. ఐహికాలను సాధించాలనే వ్యగ్రతతో… బ్రతుకునీడ్వడం కాదు… జీవితాన్ని సార్ధకం చేసుకోవాలనే భావన నిలిచింది. అందుకే సకల వైభవాలను త్యజించి “ఒక్క” నీతో జనుదెంతు… అంటాడు. ఒక్క అనడం “అన న్యశ్చింతయో” అనే భావనకు దర్పణంగా నిలుస్తుంది. మరే ఆలోచన లేకుండానీ వెంట వస్తాను అంటాడు.

ఎన్నో ఆలోచనలతో ఉన్న చిత్తంలో వ్యగ్రత కలుగు తుంది. వ్యగ్రత వల్ల “ఒక్క” దానిపై దృష్టి నిలువదు. చిత్రంలోని అన్ని వాసనలను తొలగించుకుంటే గాని అమ్మవారిని చూడడం, ఆరాధించడం, ఉపాసించడం సాధ్యపడదు. వేల సంవత్సరాలుగా రావణుడు… అమ్మదర్శనానికై తపిస్తున్నాడు. అందుకే వాల్మీకి.. ‘కామయేత్వాం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే”.. విశాలాక్షీ! నిన్ను కోరుతున్నాను… నన్ను మన్నించు, స్వీకరించు, అంటారు.
విశాలాక్షీ అనే సంబోధనయే రావణుడు సీతను అమ్మవారిగా గుర్తించాడనే సత్యాన్ని తెలుపుతుంది.

రావణుని లోని జీవుని వేదన… సీతాదేవిని లలితా త్రిపుర సుందరిగా దర్శించిన వైనాన్ని, కామేశ్వరీ స్వరూపాన్ని ధ్యానిస్తున్న సాధకుని ఆర్తిని తెలుపుతుంది. విశాలాక్షీ అనడంలో… విశాలమైన కన్నులు కలిగిన నీకు సత్యం కనిపించడం లేదా? నిజాన్ని చూచే నేర్పులేదా? చూచినా నా ఆర్తిని పట్టించుకోవెందుకు? ఏమిటి అభ్యంతరం అని నిలదీస్తున్న భావన కూడా గోచరిస్తున్నది.

అమ్మా! నాతో నిన్ను రమ్మనడం లేదు… నీతోనే నన్ను తీసుకుపో.. ఎక్కడికి తీసుకుపోయినా అభ్యంతరం లేదు వస్తానంటున్నాడు. ఎవ్వరికీ తెలియని.. తోపని సీమలకు తీసుకుపో.. అని ప్రార్థిస్తున్నాడు. ఆ సీమలు పెంజీకటి కావల ఉన్న వెలుగులే. అక్కడి వెలుగే. ఆదిశక్తి.. లలితాపరమేశ్వరి. అందుకే ఆమెను “దేవతా భ్రాజితమూర్తి” అన్నాడు. దేవతలలో ప్రకాశించే మూర్తివి అంటే దేవతల అస్థిత్వానికి మూలమైన శక్తిని అంటున్నాడు. అమ్మను గుర్తించాడు కనుకనే… నీ పద పద్మముల వద్ద ఒక సేవకుడను అంటున్నాడు.

ఇక్కడ రావణుడిలో సర్వ సమర్పణాభావన కనిపిస్తుంది. “భవత్ కటాక్షా జిరరంగ వల్లులకు అద్దినదౌ మృగనాభి కల్పుడన్” అనడంలో… రంగ వల్లులు అందంగా ఉంటాయే కాని వాటికి పరిమళం లేదు. కస్తూరికి పరిమళం ఉంటుంది కాని నల్లగా ఉండి అందంగా ఉండదు. అమ్మా! నీ కడగంటి చూపుతో నా జీవితం పరిమళభరితమైన రంగవల్లులుగా నిలుస్తుంది. “కల్పుడను” అన డంలో నేను ఇన్ని కల్పాలుగా లేదా సంవత్సరాలుగా నీ దర్శనానికై తపిస్తున్నాను… నా హృదయాన్ని గ్రహించకుండా “భ్రాజితమైన” ఐహికాలను ఇస్తున్నావు.. నాకు కావలసింది.. దేవతా భ్రాజితమూర్తివైన నీలో లయమయ్యే శ్రేయస్సుకు సంబంధిత సంపద అంటున్నాడు.

అడగడం అంటే అతనిలో ఇంకా “నేను” అనే భావన, కావాలి అనే కాముకత్వం ఉన్నాయి. ఆ వాసనలు లయం కావాలి. అంతరంగంలోని రాక్షస భావనలు పూర్తిగా నశించాలి. అందుకే అమ్మ వారు ఛీత్కరించడం.. తదుపరి రామస్వామిని ఎదిరించి పరాక్రమించడం… ఆ స్వామి చేతిలో మరణించి.. శాశ్వత నిర్వాణ దాయినిని చేరడం.. కనిపిస్తుంది.
పాలకుర్తి రామమూర్తి

Click here for more

Click here to read

Leave a Reply